APTF VIZAG: AP PRC: ఆ 3 డిమాండ్లు నెరవేరిస్తేనే చర్చలకు వస్తాం: ఉద్యోగ సంఘాలు

AP PRC: ఆ 3 డిమాండ్లు నెరవేరిస్తేనే చర్చలకు వస్తాం: ఉద్యోగ సంఘాలు

కొత్త పీఆర్సీపై చర్చించేందుకు ఉద్యోగులు రావడం లేదంటూ ప్రభుత్వం అసత్యప్రచారం చేస్తోందని పీఆర్సీ సాధనసమితి నేతలు ఆరోపించారు. చర్చలకు రావాలని ఒకసారి వాట్సప్‌ మెసేజ్‌ మాత్రమే పంపారనీ, ఉద్యోగసంఘాల ప్రతినిధులను అవమానించేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి లిఖితపూర్వక ఆహ్వానం ఇస్తేనే చర్చలకు వెళ్తామని స్పష్టం చేశారు. జీవోల రద్దు, పాతనెల జీతం, కమిటీ నివేదిక.. ఇవే తమ ప్రధాన డిమాండ్లనీ, వీటిని నెరవేరిస్తేనే చర్చలకు వెళ్తామని, లేదంటే ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 

విజయవాడలో ఇవాళ సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  నేతలు మాట్లాడుతూ..‘‘ సాధనసమితికి న్యాయ సలహాలు ఇచ్చేందుకు లాయర్లు రవిప్రసాద్‌, సత్యప్రసాద్‌ను నియమించుకున్నాం. వచ్చే నెల 3న చలో విజయవాడ చూసి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బంది, పింఛనర్లు అందరూ తరలి రావాలి. ప్రభుత్వం చేసిన కుట్రలను అందరూ గమనించాలి. ఉద్యోగుల ఐక్యతను ప్రభుత్వానికి చూపించాలి. ’’ అని పీఆర్సీ సాధన సమితి నేతలు స్పష్టం చేశారు.

చర్చల పేరుతో ప్రభుత్వం పక్కదోవ పట్టించిందని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాన్ని నమ్మి ఉద్యోగులు, ఉపాధ్యాయులు మోసపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదికలో రహస్యమేముందని, ఎందుకు బయటపెట్టడంలేదని ప్రశ్నించారు. కొత్త పీఆర్సీ వల్ల రూ.10,600 కోట్లు ఖర్చవుతుందంటున్నారు. అందుకే పాత జీతాలే ఇవ్వాలని కోరుతున్నట్లు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ‘‘ ఉద్యోగులకు కొత్త జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. జీతాల బిల్లుల తయారీ కోసం ట్రెజరీ అధికారుల మెడపై కత్తిపెట్టారు. వారిని భయపెడుతూ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. అధికారులను భయభ్రాంతులకు గురిచేసేలా మెమోలు జారీ చేస్తున్నారు. ఉద్యోగులపై ఇష్టానుసారం చర్యలు తీసుకునేందుకు ఇది ఆటవిక రాజ్యం కాదు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తేనే చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. కక్ష సాధింపు చర్యలతో అధికారులపై చర్యలు తీసుకోవద్దు’’ అని నేతలు కోరారు

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results