APTF VIZAG: ఉపాధ్యాయులు కోరితే బోధనేతర విధులూ తప్పిస్తాం : మంత్రి బొత్స

ఉపాధ్యాయులు కోరితే బోధనేతర విధులూ తప్పిస్తాం : మంత్రి బొత్స

ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి వారిని తప్పించామని, వారు కోరితే మనబడి నాడు-నేడు బాధ్యతలు, బోధనేతర విధుల నుంచి కూడా తప్పిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ నెల ఏడున జరిగే జయహో బిసి మహాసభ జయప్రదానికి సన్నాహక సమావేశం శ్రీకాకుళంలోని వైసిపి కార్యాలయంలో శనివారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఓటమి భయంతోనే ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను తప్పించారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు. తమకు ఏ విధమైన బోధనేతర విధులూ ఉండకూడదని, బోధించడం తప్ప ఇతర ఏ విధమైన కార్యక్రమాలూ తమకు అప్పగించొద్దని ఉపాధ్యాయులు కోరారని తెలిపారు. దీన్ని పరిగణనలోకి తీసుకొనే వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించామని చెప్పారు. విలేకర్లు అడిగిన మరో ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏం పెట్టుబడులు తెచ్చారో చెప్పాలన్నారు. చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్రకు ఒక్క కంపెనీ కూడా తేలేకపోయారని, రాజశేఖరరెడ్డి హయాంలోనే విశాఖ ఐటి హబ్‌, ఫార్మా హబ్‌ వచ్చాయని తెలిపారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. తాము బిసిలకు చేసింది చెప్పేందుకే విజయవాడలో ఈ నెల ఏడున జయహో బిసి మహాసభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సభకు బిసి నేతలంతా తరలి రావాలని కోరారు. మంత్రి సీదిరి అప్పలరాజు, విజయనగరం ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, శ్రీకాకుళం జడ్‌పి చైర్‌పర్సన్‌ విజయ, వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌, కిల్లి కృపారాణి పాల్గొన్నారు.

No comments:

Post a Comment