వేతనాలు తగ్గడానికి వీల్లేదు.పీఆర్సీపై హైకోర్టులో వ్యాజ్యం.విభజన చట్టం ఇదే చెబుతోంది
పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17న జారీచేసిన జీవో1ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ చైర్మన్ కేవీ కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో ఉద్యోగుల జీతాల్లో కోత పడుతుందని, ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 78(1) ఏపీకి వచ్చే ఉద్యోగులకు కల్పించే ప్రయోజనాలను స్పష్టం చేస్తోందని, దాని ప్రకారం హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చిన ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, వారికి కల్పించే హెచ్‌ఆర్‌ఏ తదితర ప్రయోజనాలకు రక్షణ ఉంటుందని గుర్తుచేశారు.ఏపీ పునర్విభజన చట్టం-2014కి విరుద్ధంగా ఉన్న ఈ జీవోను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు.తమ వినతులు పరిగణలోకి తీసుకొని కొత్తగా వేతనాలు సవరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని, జీవో1ని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శులతోపాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, పే రివిజన్ కమిషన్ కమిషనర్‌ను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.‘రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అశుతోశ్ మిశ్రా నేతృత్వంలో 2018లో అప్పటి ప్రభుత్వం 11వ పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ లేవనెత్తిన పలు అంశాలపై మేం సమగ్ర వివరాలు అందజేశాం. దురదృష్టవశాత్తు కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టకపోగా కమిషన్ రిపోర్టును పరిశీలించేందుకు కార్యదర్శులతో మరో కమిటీ వేసింది. పీఆర్‌సీ కమిషన్ నివేదికను గానీ, కార్యదర్శుల కమిటీ నివేదికలో పరిశీలించిన విషయాలను గానీ ప్రభుత్వం బయటపెట్టకుండా పీఆర్సీపై జీవో ఇచ్చింది. సంబంధిత జీవో సహజ న్యాయసూత్రాలు, విభజన చట్టానికి విరుద్ధం. ఈ నేపథ్యంలో న్యాయస్థానం జోక్యం చేసుకొని తగిన ఉత్తర్వులు జారీ చేయాలి’ అని పిటిషనర్ కోరారు.
ఉద్యమిస్తూనే.. న్యాయ పోరాటం: కృష్ణయ్య
పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ చైర్మన్ కేవీ కృష్ణయ్య చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు తగ్గించేందుకు అవకాశం లేదన్నారు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీతో ఉద్యోగులందరి వేతనాల్లో కోత పడుతోందని చెప్పారు. అందువల్ల జీతాల తగ్గింపుపై ప్రభుత్వంపై పోరాడుతూనే న్యాయ పరంగానూ ముందుకెళ్లాలని నిర్ణయించామని చెప్పారు"
No comments:
Post a Comment