జగన్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడిన ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు యూటర్న్ తీసుకున్నారు. తాను అనని మాటలను అన్నట్టు వక్రీకరించారని ఆయన వాపోవడం గమనార్హం.
ఉద్యోగుల పీఆర్సీ, డీఏలు, ఇతరత్రా సమస్యలపై ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో ఉద్యోగ సంఘాల నాయకులు పరిధి మించి మాటల తూటాలు పేల్చుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో జరిగిన ఎన్జీవోల అంతర్గత సమావేశంలో బండి శ్రీనివాసరావు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో లీక్ అయింది.
ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడి ఘాటు వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము తలచుకుంటే ప్రభుత్వాల్ని నిలబెట్టగలం, అలాగే కూల్చగలమని బండి హెచ్చరించారు. మీ మాయ మాటలు విని వైసీపీకి 151 సీట్లు కట్టబెట్టినట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఉద్దేశించి బండి శ్రీనివాసరావు అనడంపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ పరమైన విమర్శలు చేసిన శ్రీనివాసరావుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో బండి శ్రీనివాసరావు ఇవాళ స్పందించారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తన మాటలను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమది ఉద్యోగస్తుల పార్టీ అని చెప్పుకొచ్చారు. తాము ఏ పార్టీకి తొత్తులం కాదని పేర్కొన్నారు. ఉద్యోగుల్లో బండి వ్యతిరేకులే ఓ పథకం ప్రకారం అంతర్గత సమావేశాన్ని వీడియో తీసి, రిలీజ్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు త్వరలో రిటైర్డ్ అవుతున్నారని, రాజకీయ ఆకాంక్షను నెరవేర్చుకునే క్రమంలో కొందరి మెప్పుకోసం అవాకులు చెవాకులు పేలినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. ఏది ఏమైనా జగన్ ప్రభుత్వంపై తాను ఎలాంటి పరుష వ్యాఖ్యలు చేయలేదని బండి చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
No comments:
Post a Comment