APTF VIZAG: ఉద్యోగుల సమస్యలపై కనీసం చర్చించేవారే లేరు: ఏపీ ఉద్యోగ సంఘాల ఆవేదన

ఉద్యోగుల సమస్యలపై కనీసం చర్చించేవారే లేరు: ఏపీ ఉద్యోగ సంఘాల ఆవేదన

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయంటూ ఉద్యోగ సంఘాలు కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందించారు. ఉద్యోగుల సమస్యలపై కనీసం చర్చించేవారే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 13 లక్షల మందికి సంబంధించిన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉందని అన్నారు. ప్రభుత్వం దృష్టికి 71 డిమాండ్లు తీసుకెళ్లామని చెప్పారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందనలేదని తెలిపారు.

11వ పీఆర్సీ అమలు చేయాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని బొప్పరాజు స్పష్టం చేశారు. ఇస్తాం, ఇస్తాం అంటూ 7 డీఏలు పెండింగ్ లో పెట్టారని ఆరోపించారు. ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రాగానే సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ చెప్పారని, అటు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశం కూడా పెండింగ్ లో ఉందని వెల్లడించారు. ఉద్యోగులకు సంబంధించి వైద్య ఖర్చుల రీయింబర్స్ మెంట్ కూడా జరగడంలేదని బొప్పరాజు వాపోయారు.

ప్రభుత్వం తమ సమస్యలు వినే స్థితిలో లేదని, అందుకే రోడ్లపైకి వచ్చి ఉద్యమించాల్సి వస్తోందని అన్నారు. రేపటి నుంచి ప్రతి ఉద్యోగి నల్లబ్యాడ్జీ ధరించి నిరసన తెలపాలని పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి అన్ని కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం దిగిరాకుంటే రెండో దశలో ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని బొప్పరాజు స్పష్టం చేశారు.

ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్ సైతం ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు పోరుబాటను వీడబోమని స్పష్టం చేశారు. పీఆర్సీ ప్రకటించాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని తెలిపారు. ఎస్మా ప్రయోగించినా వెనుకడుగు వేసేది లేదని తెగేసి చెప్పారు

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results