APTF VIZAG: రాజ్యాంగ దినోత్సవం అంటే ఏంటీ? ఎందుకు జరుపుకొంటారు?రాజ్యాంగం (Constitution)

రాజ్యాంగ దినోత్సవం అంటే ఏంటీ? ఎందుకు జరుపుకొంటారు?రాజ్యాంగం (Constitution)

రాజ్యాంగం అనగా ప్రభుత్వం యొక్క విధానం. ఈ రాజ్యాంగంలో చట్టాలు, ప్రభుత్వాలు నడుచుకునే విధానాలు, ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగపరమైన విధులు విధానాలూ పొందుపరచబడి వుంటాయి. ప్రతి దేశానికి ప్రభుత్వమనేది సర్వసాధారణం. ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం అనునది అతి ముఖ్యమైంది. ప్రభుత్వం అనునది శరీరమైతే, రాజ్యాంగం అనునది ఆత్మ లాంటిది. ప్రభుత్వాలకు దిశా నిర్దేశాలు చూపించేదే ఈ రాజ్యాంగం.

రాజ్యాంగ దినోత్సవం అంటే ఏంటీ? ఎందుకు జరుపుకొంటారు?

 1949 నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోదముద్ర పడినా... రాజ్యాంగ దినోత్సవం నిర్వహించలేదు. ఆ ఆనవాయితీ 2015లో మొదలైంది. ప్రతీ ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్ 19న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

 అసలు నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకొంటారన్న అనుమానాలు, సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఎందుకో తెలుసుకోవాలంటే ఓసారి చరిత్రలోకి వెళ్లాలి.

సుదీర్ఘకాలం పరాయి పాలనలో మగ్గిన దేశం భారతదేశం. ఎందరో స్వాతంత్ర్యసమరయోధుల త్యాగ ఫలితాలతో 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారత్‌గా అవతరించింది. ఆ తర్వాత ప్రతి స్వతంత్ర దేశానికి ఒక రాజ్యాంగం వుండాలి. రాజ్యాంగం అంటే దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపిక వంటిది. ఆ దీపస్తంభపు వెలుగుల్లో సర్వసత్తాక సౌర్వభౌమాధికార దేశంగా ప్రగతి వైపు అడుగులు వేయాలి. అందుకనే రాజ్యాంగానికి ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో అంతటి విశిష్టమైన స్థానముంది. కోట్లాదిమంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన దేశం కంటే ముందు అనేకదేశాలు రాజ్యాంగాలను రచించాయి. 

అయితే భారత రాజ్యాంగ రచన ఒక సంక్లిష్టం. దీనికి కారణం... దేశంలో అనేక మతాలు, తెగలు, ఆదీవాసీలు, దళితులు, అణగారిన, పీడనకుగురైన వర్గాలు... తదితరులున్నారు. వీరి ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ రచన ఒక సవాల్‌లాంటిదే. ఈ నేపథ్యంలో భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్‌ నేతృత్వంలోని రాజ్యాంగ సభ డా.బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ సారధిగా డ్రాఫ్టింగ్‌ కమిటీని ఏర్పాటైంది. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్‌ భిన్నత్వ సమ్మేళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఎంతగానో శ్రమించారు. 

రాజ్యాంగమంటే కేవలం ప్రభుత్వ విధివిధానాలు, శాసనసభల రూపకల్పనే కాదు కోట్లాది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింభించాలన్నది ఆయన ప్రధానాశయం. ఆయన కృషి ఫలితంగానే ప్రపంచంలోనే కొత్తదైన రాజ్యాంగం రూపుదిద్దుకుంది. అందుకనే ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే భారతరాజ్యాంగం ఉన్నతవిలువలు కలిగిందంటూ మన్ననలు పొందింది. 1949 నవంబర్‌ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించింది. జనవరి 26, 1950 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. నవంబర్‌ 26న రాజ్యాంగసభ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కనుకనే ఏటా ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నాం.

2015లో అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26న ఏటా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.

మన దేశంలో ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. 1949లో ఇదే రోజున భారత రాజ్యాంగానికి రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది. తర్వాత 1950 జవనరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నవంబర్ 26ను నేషనల్ లా డే లేదా సంవిధాన్ దివస్‌గానూ పిలుస్తారు.

భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26 న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది.

అవతారిక:

రాజ్యాంగంలో అవతారిక ప్రముఖమైనది. రాజ్యాంగ నిర్మాణం ద్వారా భారతీయులు తమకు తాము అందివ్వదలచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పట్ల తమ నిబద్ధతను, దీక్షనూ ప్రకటించుకున్నారు.

భారత ప్రజలమైన మేము, భారత్‌ను సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పరచాలని, దేశ పౌరులందరికీ కింది అంశాలు అందుబాటులో ఉంచాలని సంకల్పించాము:

న్యాయం - సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం;

స్వేచ్ఛ - ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, మతావలంబన స్వేచ్ఛ;

సమానత్వం - హోదాలోను, అవకాశాలలోను సమానత్వం;

సౌభ్రాతృత్వం - వ్యక్తి గౌరవం పట్ల నిష్ఠ, దేశ సమైక్యత సమగ్రతల పట్ల నిష్ఠ;

మా రాజ్యాంగ సభలో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి, ఆమోదించి, మాకు మేము సమర్పించుకుంటున్నాము.

భారత రాజ్యాంగం లోని షెడ్యూళ్లు:

భారత రాజ్యంగ రూపకల్పన సమయంలో 8 షెడ్యూళ్ళు ఉండగా ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9 వ షెడ్యూల్ ను చేర్చగా, 1985లో 52 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాలంలో 10 వ షెడ్యూల్ ను రాజ్యాంగంలో చేర్చారు. ఆ తర్వాత 1992లో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా 11, 12 వ షెడ్యూళ్ళను చేర్చబడింది.


1 వ షెడ్యూల్ .......భారత సమాఖ్యలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు

2 వ షెడ్యూల్ ......జీత భత్యాలు

3 వ షెడ్యూల్ ......ప్రమాణ స్వీకారాలు 

4 వ షెడ్యూల్ ......రాజ్యసభలో రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సీట్ల విభజన

5 వ షెడ్యూల్ ...... షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన

6 వ షెడ్యూల్ రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు

9 వ షెడ్యూల్ ......కోర్టుల పరిధిలోకి రాని కేంద్ర, రాష్ట్రాలు జారీ చేసిన చట్టాలు

10 వ షెడ్యూల్ ......పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం

11 వ షెడ్యూల్ ......గ్రామ పంచాయతిల అధికారాలు

12 వ షెడ్యూల్ ......నగర పంచాయతి, మునిసిపాలిటిల అధికారాలు.

2015 నుంచి రాజ్యాంగ దినోత్సవం.

కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ప్రతి ఏటా నవంబర్‌ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యాసంస్థల్లో ఈ రోజు రాజ్యాంగం గురించి తెలిసిన అనుభవజ్ఞులచే ఉపన్యాసాలు, వ్యాసరచన తదితర కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ రాజ్యాంగం ఏర్పడిన 66 ఏళ్ల తర్వాత తొలిసారిగా రాజ్యాంగం ఆమోదిత దినోత్సవాన్ని 2015, నవంబర్‌ 26న జరుపుకుంది. రాజ్యాంగం పీఠిక ప్రజల రోజువారీ జీవితంలో భాగంగా మారాలి. అదే మన లక్ష్యం. మన రాజ్యాంగాన్ని మరింతగా తెలుసుకునేలా ఈ రోజు మనకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంటూ.

No comments:

Post a Comment

Featured post

IMMS APP updated latest Version 1.5.3