APTF VIZAG: బకాయిలు ఒకేసారి ఇవ్వలేం. జనవరి నుంచి దశల వారీగా చెల్లింపు.మంత్రివర్గ ఉపసంఘం భేటీలో బొత్స

బకాయిలు ఒకేసారి ఇవ్వలేం. జనవరి నుంచి దశల వారీగా చెల్లింపు.మంత్రివర్గ ఉపసంఘం భేటీలో బొత్స

ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ఒకేసారి ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చేసింది. జనవరి నుంచి దశల వారీగా చెల్లిస్తామని, అది కూడా పండగ కానుకగా భావించాలని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఉద్యోగ సంఘాలతో పెండింగ్‌ సమస్యలపై చర్చించిన మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చిచెప్పారు. తాజా సమావేశం.. సీపీఎస్‌ కోసం కాదని కమ్యూనికేషన్‌ గ్యాప్‌వల్ల 'సీపీఎ్‌సపై సమావేశం' అని ఆహ్వానం పంపారని వివరణ ఇచ్చారు. ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలపై చర్చించడానికి పిలిచామని చెప్పారు. అయితే, 'సీపీఎ్‌సపై సమావేశం అని పిలిచారు కదా' అని సంఘాల నేతలు ప్రస్తావించగా.. కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వల్లే ఇలా జరిగిందని, పింఛన్‌ విధానంపై త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని బొత్స స్పష్టం చేశారు. మంగళవారం అమరావతి సచివాలయంలో సీపీఎస్‌, ఉద్యోగుల పెండింగ్‌ అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం ఆయా ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సాధారణ పరిపాలనశాఖ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీజేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, కార్యదర్శి ఆస్కారరావు, ఎస్టీయూ అధ్యక్షులు సాయిశ్రీనివాస్‌, పీఆర్టీయూ అధ్యక్షులు గిరిప్రసాద్‌, యూటీఎఫ్‌ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, తదితర ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.


వేతనాల కోసం వెయిటింగ్‌ తగదు


సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు తమ సమస్యలను ఏకరువుపెట్టారు. భవిష్యత్తులో ఓపీఎ్‌సపై మాత్రమే తమను చర్చలకు పిలవాలని కోరారు. ప్రతి నెల జీతాలు, పింఛన్లు 1వ తేదీనే అందేలా చర్యలు తీసుకోవాలని, గత కొన్నాళ్లుగా ఇవి ఎప్పుడు ఇస్తున్నారో తెలియక ఉద్యోగులు నిరీక్షించే పరిస్థితి వచ్చిందని ప్రస్తావించారు. ఇప్పటికీ పలువురు ఉద్యోగులకు ఈ నెల జీతాలు పడలేదన్నారు. దీనిపై స్పందించిన బొత్స.. తొలుత ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమంపై దృష్టి పెడుతున్నామని, ఉద్యోగులకు రెండో ప్రాధాన్యంగా వేతనాలు ఇస్తున్నామని అన్నట్లు తెలిసింది. డీఏ ఎరియర్స్‌, ఏపీజీఎల్‌ఐ లోన్లు, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ సకాలంలో రావడంలేదని బకాయిలన్నీ చెల్లించాలని సంఘాల నేతలు కోరారు. అయితే, బకాయిలను ఒకేసారి చెల్లించలేమని.. సంక్రాంతి కానుకగా జనవరి నుంచి దశల వారీగా ఇస్తామని బొత్స చెప్పినట్లు తెలిసింది. తదుపరి సమావేశం నాటికి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు రోడ్‌ మ్యాప్‌ ఇస్తామని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. అదేవిధంగా పబ్లిక్‌ సెక్టార్‌, గురుకులాలు, యూనివర్సిటీ ఉద్యోగులకు 62 ఏళ్ల వయోపరిమితికి సంబంధించి త్వరలో జీవో విడుదల చేస్తామని తెలిపింది. వచ్చే ఏప్రిల్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు షెడ్యూల్‌ ఇవ్వనున్నట్లు కమిటీ పేర్కొంది. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఎవ్వరినీ తొలగించడంలేదని బొత్స స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో ఫీల్డ్‌ ఉద్యోగులకు ఫేస్‌ అటెండెన్స్‌ తొలగింపు అంశాన్ని పరిశీలిస్తామని,వచ్చే మార్చిలో మరోసారి సమావేశం ఏర్పాటుచేసి సమస్యలు పరిష్కరిస్తామని కమిటీ హామీ ఇచ్చింది.


బదిలీలపై పెదవి విరుపు


వచ్చే సంక్రాంతికి ఉపాధ్యాయుల బదిలీలు చేస్తామని మంత్రి బొత్స సమావేశంలో హామీ ఇచ్చారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాల నేతలు భేటీలోనే పెదవి విరిచారు. సంక్రాంతి సమయానికి బదిలీలు చేపడితే పదోతరగతి విద్యార్థులపై ప్రభావం చూపే అవకాశం ఉందని, అందువల్ల సంక్రాంతికి కూడా ప్రభుత్వం బదిలీలు చేపట్టే అవకాశం లేదని నేతలు తేల్చి చెప్పారు. కేవలం ఉపాధ్యాయుల ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నమేనని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.


అన్నిటినీ పరిష్కరిస్తాం: బొత్స


సీపీఎస్‌ అంశంపై ఉద్యోగ సంఘాలను మరోసారి చర్చలకు పిలుస్తామని మంత్రి బొత్స చెప్పారు. ఉద్యోగ సంఘాలతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62ఏళ్లకు పెంచాలనే ప్రభుత్వ విధానం విషయంలో విశ్వవిద్యాలయ, గురుకుల విద్యాసంస్థల ఉపాధ్యాయుల కోరుతున్న విధంగా న్యాయపరంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఉద్యోగుల సమస్యల్లో ప్రతి అంశాన్ని సున్నితంగా తీసుకుని, ప్రభుత్వం పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు


సీపీఎస్‌ రద్దయ్యే వరకు పోరాడతాం!


సీపీఎస్‌ రద్దుపై చర్చించేందుకు ప్రభుత్వం ఎన్ని సార్లు పిలిచినా వెళ్తామని, తమ వైఖరి చెప్తామని ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ ఆస్కార్‌రావు చెప్పారు. సీపీఎ్‌సపై ప్రత్యేకంగా మరోసారి చర్చిస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చినట్లు తెలిపారు. కేసులు పెట్టినా సీపీఎస్‌ రద్దయ్యే వరకు తాము పోరాడతామని ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘ నేత బాజీ పటాన్‌ స్పష్టం చేశారు. గతంలో ప్రస్తావించిన సమస్యలపైనే చర్చించారని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. ఉపాధ్యాయుల సర్దుబాటు ఇతర అంశాలను పరిష్కరిస్తామని బొత్స హామీ ఇచ్చారని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్‌పీ మన్నా చెప్పారు. ఇప్పటి వరకు అందరికీ జీతాలు పడకపోవడంపై బుధవారం అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చయనున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment