విద్యా కానుక కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించిన బూట్లను అందరూ ప్రతిరోజూ వేసుకొని వచ్చేలా చూడాల్సిన బాధ్యత తరగతి ఉపాధ్యాయులదేనని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. నాణ్యత లేకపోవడంతో కొన్నిచోట్ల బూట్లు చిరిగిపోయాయి. మరికొన్నిచోట్ల సైజులు సరిగా ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు పాఠశాలలకు బూట్లు వేసుకొని రావడం లేదు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు ఉన్నత పాఠశాలలో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఏడో తరగతిలో ఒక్కరూ బూట్లు ధరించలేదు. దీంతో బూట్లు, సాక్సులు ధరించే అలవాటును పెంపొందించాల్సిన బాధ్యత తరగతి ఉపాధ్యాయుడిదేనని ఆయన ఆదేశించారు. చిరిగిపోయిన, సైజులు లేని బూట్లు వేసుకురావాలని ఎలా చెప్పాలి? అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. విద్యా కానుక కింద అందించిన సామగ్రిని వినియోగించేలా జిల్లా విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యకార్యదర్శి ఆదేశించారు.
ధర పెరిగినా అదే సమస్య.
జత బూట్లు, రెండు జతల సాక్సులకు ఈ ఏడాది గుత్తేదారుకు రూ.51 ఎక్కువగా చెల్లించారు. ధర పెరిగినా నాణ్యత మాత్రం పెరగలేదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. విద్యాకానుక కిట్లలో బ్యాగ్, బెల్ట్, బూట్లు, సాక్సులు, ఏకరూప దుస్తులు కలిపి దాదాపు రూ.1,996 చొప్పున వ్యయం చేశారు. 40.31లక్షల కిట్లు కొనుగోలు చేసినప్పటికీ ఎక్కువ ధరలకే కొనడంపై ఆరోపణలు వ్యక్తమయ్యాయి. బ్యాగ్‌లు సైతం సరఫరా చేసిన 15రోజులకే చిరిగిపోయాయి. దాదాపు 9లక్షల బ్యాగ్‌లను మార్పు చేశారు. ఇందులో సమగ్ర శిక్షలో పని చేస్తున్న ముగ్గురు సిబ్బంది చక్రం తిప్పినట్లు ఆరోపణలు వచ్చినా వీరిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నారు.
No comments:
Post a Comment