ప్రతి పాఠశాలలో విద్యార్థులకు కనీసం రెండు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా వారిని తీర్చిదిద్దాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదేశించారు. సమగ్ర శిక్ష కార్యాలయంలో గురువారం జరిగిన అండర్-14, 17, 19 పాఠశాల క్రీడల కార్యదర్శుల కార్యనిర్వాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘విద్యార్థులకు సామర్థ్యాల పరీక్ష నిర్వహించి ఖేలో ఇండియా ఫిట్‌నెస్ యాప్‌లో వివరాలు నమోదు చేయాలి. ఆసక్తి గల విద్యార్థులను తరగతులు పూర్తయిన తర్వాత రోజూ రెండు గంటలు ఆటలు ఆడించాలి. గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి పాఠశాలలో క్రీడలు నిర్వహించేలా పీఈటీలు బాధ్యత వహించాలి. రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబరు నెలాఖరుకల్లా పూర్తి చేసి, జాతీయ పోటీలకు జట్లను సిద్ధం చేయాలి. ప్రాథమిక పాఠశాల నుంచి జూనియర్ కళాశాల వరకు అవసరమైన క్రీడా పరికరాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి జిల్లాలో ఒక పాఠశాలను ‘స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్’గా ఎంపిక చేసి, విద్యార్థులకు క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి’ అని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ అదనపు సంచాలకుడు శ్రీనివాసరావు, సంచాలకురాలు పార్వతి, జేడీ రామలింగం, రాష్ట్ర పాఠశాల క్రీడల కార్యదర్శి భానుమూర్తిరాజు పాల్గొన్నారు.
No comments:
Post a Comment