APTF VIZAG: జీవో 117కు సవరణలు? విద్యార్థులు, టీచర్ల నిష్పత్తిని మార్చాలని సంఘాలు డిమాండ్‌. త్వరలో చెబుతానన్న మంత్రి బొత్స . ఉపాధ్యాయ సంఘాలతో సుదీర్ఘ చర్చ

జీవో 117కు సవరణలు? విద్యార్థులు, టీచర్ల నిష్పత్తిని మార్చాలని సంఘాలు డిమాండ్‌. త్వరలో చెబుతానన్న మంత్రి బొత్స . ఉపాధ్యాయ సంఘాలతో సుదీర్ఘ చర్చ

 ఉపాధ్యాయుల రేషనలైజేషన్‌కు సంబంధించి వస్తున్న ఒత్తిడికి రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సర్కారు ఇచ్చిన జీవో 117లో కొన్ని సవరణలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే, కీలకమైన వాటి మీద సవరణలు ఉంటాయా? లేదాదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవో 117పై వస్తున్న తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో  విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉపాధ్యాయ సంఘాలతో మంగళవారం సమావేశమయ్యారు. యూటీఎఫ్‌, ఎస్‌టీయూ, ఏపీటీఎఫ్‌, ఏపీటీఫ్‌(1938), ప్రధానోపాధ్యాయుల సంఘం, ఆప్టా తదితర సంఘాల నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. జీవో 117లో ఉన్న లోపాలు, సమస్యలను సంఘాల నాయకులు మంత్రికి వివరించారు. సదరు జీవోను అమలుచేస్తే విద్యాశాఖ ఇబ్బందుల్లో పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధానంగా నాలుగు అంశాలపై సంఘాలు తమ వాదన వినిపించాయి. ప్రాథమిక పాఠశాలల్లో గతంలో విద్యార్థులు:ఉపాధ్యాయుల నిష్పత్తి 1:20గా ఉండేదని, జీవో 117లో దాన్ని 1:30గా మార్చడం తగదన్నారు.

ఇప్పటికే పలు ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయని, ఈ జీవోను అమలుచేస్తే ప్రాథమిక పాఠశాలల్లో సగం ఏకోపాధ్యాయగా మారిపోతాయన్నారు. అదే సమయంలో ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రఽధానోపాధ్యాయులు, పీఈటీలను తీసేస్తామని చెప్పడం, ఉన్నత పాఠశాలల్లో నిర్దిష్ట సంఖ్యలో కంటే తక్కువ విద్యార్థులుంటే ప్రధానోపాధ్యాయులు, పీఈటీలు ఉండబోరని చెప్పడం సరికాదన్నారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు:ఉపాధ్యాయుల నిష్పత్తిని పెంచడం వల్ల ఒక్కో ఉపాధ్యాయుడు వారానికి 42 తరగతులు తీసుకోవాల్సి వస్తుందని, ఇది తీవ్రభారం అవుతుందని అన్నారు. ఇప్పటివరకు వారానికి 32 తరగతులు తీసుకుంటుండగా.. దీన్ని 42 తరగతులకు పెంచడం, ఒక్కోసారి 48 తరగతులు కూడా తీసుకోవాల్సి రావడం సరికాదన్నారు. దీనివల్ల విద్యానాణ్యత దెబ్బతింటుందన్నారు. అదేవిధంగా ప్రాథమికోన్నత పాఠశాలల్లో కేవలం ఆంగ్లమీడియం మాత్రమే పెట్టడం సరికాదని, తెలుగుమీడియం కూడా ఉండాలన్నారు. ఆయా అంశాలపై స్పందించిన మంత్రి బొత్స కొన్నింటిని మార్చే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పినట్టు తెలిసింది. ముఖ్యంగా హెచ్‌ఎంలు, పీఈటీల అంశంలో సవరణలు చేస్తామని, వారిని ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని పేర్కొన్నట్లు సమాచారం. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు:ఉపాధ్యాయుల నిష్పత్తిపైనా ఆలోచిస్తామన్నారు. అయితే, ఉపాధ్యాయులకు వారానికి 42 తరగతులు పడవని, 36కు మించి తీసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పినట్టు తెలిసింది. యూటీఎఫ్‌ రాష్ట్ర ఽఅధ్యక్షుడు ఎన్‌. వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల, ఎస్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయిశ్రీనివాస్‌, తిమ్మన్న, ఏపీపీటీఏ నేతలు కాకి ప్రకాశ్‌రావు, వైసీపీ టీచర్స్‌ అసోసియేషన్‌, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గిరిప్రసాద్‌, మల్లు శ్రీధ ర్‌రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

త్వరలో ఉపాధ్యాయుల బదిలీలు

రాష్ట్రంలో టీచర్ల బదిలీలను త్వరలోనే చేస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు. దీనిపై సంఘాల నుంచి అభిప్రాయాలు కోరారు. ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడాకే బదిలీలపై మార్గదర్శకాలు ఇస్తామని చెప్నిట్టు సమాచారం. దివ్యాంగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని కొన్ని సంఘాలు విజ్ఞప్తిచేసినట్టు తెలిసింది.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4