APTF VIZAG: ప్రభుత్వానికి అన్నీ దొంగ లెక్కలే: బొప్పరాజు వెంకటేశ్వర్లు

ప్రభుత్వానికి అన్నీ దొంగ లెక్కలే: బొప్పరాజు వెంకటేశ్వర్లు

నాలుగు స్తంభాలాటకు అడ్డుకట్టవేయాలని ప్రభుత్వానికి ముందే చెప్పామని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. డిమాండ్లు నెరవేర్చే వరకు తమ ఉద్యమం ఆగబోదని హెచ్చరించారు. ప్రభుత్వం అన్నీ దొంగ లెక్కలు చెబుతోందని ఆరోపించారు.

"ప్రభుత్వం ఇలాంటి పీఆర్సీ ప్రకటించడం ఒక చరిత్ర.. ఉద్యోగుల ఉద్యమం కూడా ఒక చరిత్రే. ఈనెల 5 నుంచి సహాయ నిరాకరణ చేపడతాం. ఉద్యోగుల సమ్మెతో ప్రజలకు అసౌకర్యం బాధ్యత ప్రభుత్వానిదే. ఉద్యోగుల ఉద్యమమంటే ఏంటో ఈ ప్రభుత్వానికి తెలియాలి. మా వెనుక లక్షలాదిగా ఉద్యోగులున్నారు. ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు కలగాలి" అని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

అప్పటి వరకు సజ్జల మొహం చూడొద్దన్నారు: సూర్యనారాయణ

ఉద్యోగులకు రక్షణ కవచంగా తమ నాలుగు సంఘాలు ఉంటాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ అన్నారు. విజయవాడ బీఆర్డీఎస్ రోడ్డులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తమ మధ్య గాలి కూడా చొరబడడానికి అవకాశం లేని విధంగా ఐక్యంగా ఉంటామని.. ఆత్మసాక్షిగా ఉద్యోగుల ముందు నిలబడతామని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని వితండ వాదాన్ని వీడి మాయా లెక్కల నుంచి బయటకు రావాలని.. వాస్తవాలను అంగీకరించాలన్నారు. పీఆర్సీ జీవోల వెనక్కి తీసుకునే వరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మొహం చూడొద్దని ఉద్యోగులు చెప్పారన్నారు. హెచ్ఎస్ఏ పాత శ్లాబులు యథాతథంగా కొనసాగించాలని సూర్యనారాయణ డిమాండ్ చేశారు.

అంచనాలకు మించి ఉద్యోగులు.. చేతులెత్తేసిన పోలీసులు

'చలో విజయవాడ'కు ఏపీ వ్యాప్తంగా ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. జిల్లాలతో పాటు విజయవాడ వెళ్లే మార్గాల్లో పోలీసుల నిర్బంధాలు కొనసాగినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. ఊహించని రీతిలో పెద్ద ఎత్తున విజయవాడ చేరుకున్నారు. అంచనాలకు మించి ఉద్యోగులు రావడంతో చేసేదేమీ లేక పోలీసులు చేతులెత్తేశారు.

విజయవాడలో ఉద్యోగుల ఉద్యమ హోరు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులు భారీగా తరలి రావడంతో విజయవాడ జన సంద్రమైంది. ఎన్జీవో హోం నుంచి అలంకార్ థియేటర్ మీదుగా బీఆర్డీఎస్ కూడలి వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. దీంతో ఆయా మార్గాలు ఇసుకేస్తే రాలనంతగా మారిపోయాయి.

No comments:

Post a Comment