APTF VIZAG: పాఠశాలల విలీనం కాకుండానే రికార్డుల మార్పు.హైస్కూళ్లకు పిల్లల జాబితాపంపించాలని ఆదేశాలు

పాఠశాలల విలీనం కాకుండానే రికార్డుల మార్పు.హైస్కూళ్లకు పిల్లల జాబితాపంపించాలని ఆదేశాలు

ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు విలీనం కాకుండానే రిజిస్టర్లను అప్పగించాలంటూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొంది. కాగితాల్లోనే మ్యాపింగ్‌, పిల్లల తరలింపు, రికార్డుల స్వాధీనం పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది 250 మీటర్ల పరిధిలోని ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. చాలా హైస్కూళ్లలో గదుల కొరత కారణంగా ప్రాథమిక బడుల్లోనే 3, 4, 5 తరగతులను నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది మూడు కిలోమీటర్ల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను విలీనం చేసేందుకు మ్యాపింగ్‌ చేశారు. ఇప్పుడు ప్రాథమిక పాఠశాలలకు చెందిన పూర్తి రికార్డులను ఈనెల 20లోపు హైస్కూళ్లలో అప్పగించాలని విద్యాశాఖ ఆదేశించింది. టీసీలు, రికార్డు షీట్లు, ప్రవేశాల రిజిస్టర్‌, ఇతర డాక్యుమెంట్లను అప్పగించాలంది. ఉన్నత పాఠశాలల్లో పాత రిజిస్టర్లలోనే వివరాలు నమోదు చేయాలని, విద్యార్థుల పేర్లను చైల్డ్‌ ఇన్ఫోలోకి మార్చేయాలంది. అంటే... పిల్లలు ప్రాథమిక బడుల్లో చదువుకుంటున్నా వీరి పేర్లు మాత్రం సమీపంలోని ఉన్నత పాఠశాలల్లోకి వెళ్లిపోనున్నాయి.

ఫర్నిచర్‌ సర్దుబాటు ఎలా?

‘నాడు-నేడు’ కింద మొదటి విడతలో ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. ఇప్పుడు వాటి నుంచి 3, 4, 5 తరగతులను హైస్కూళ్లకు తరలించడంతో డ్యుయల్‌ డెస్క్‌లు, టీవీలు, గ్రీన్‌ఛాక్‌పీస్‌ బోర్డులు వృథాగా మారుతున్నాయి. వీటిని ఉన్నత పాఠశాలలకు తరలించాలని ఆదేశించినా గదుల కొరత కారణంగా వినియోగించలేని పరిస్థితి. ప్రాథమిక పాఠశాలల్లో మిగిలే 1, 2 తరగతులతో అంగన్‌వాడీలను కలపనున్నారు. చిన్నపిల్లలు డ్యుయల్‌ డెస్క్‌లను వినియోగించ లేదనందున తరగతి గది కోసం వాటిని మూలకుపడేయాల్సి వస్తోందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. కడప జిల్లాలో ఓ ఉన్నత పాఠశాలకు 11 ప్రాథమిక బడుల నుంచి 3, 4, 5 తరగతుల విద్యార్థులు వస్తున్నారు. వీరందర్నీ మూడు, నాలుగు గదుల్లో సర్దుబాటు చేస్తున్నారు. సంబంధిత రికార్డులను విడివిడిగా నిర్వహించడం కష్టంగా ఉందని, ఫర్నిచర్‌ సర్దుబాటులోనూ ఇబ్బందులు పడుతున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today