దేశంలో మరోసారి కొవిడ్ విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొంది. గత కొన్ని రోజులుగా భారీగా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తక్షణమే ఇది అమలులోకి వస్తుందని, తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు అమలులో ఉంటుందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి డా.జితేంద్ర సింగ్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఉద్యోగుల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.
గతేడాది కూడా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో తమ ఉద్యోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా బయోమెట్రిక్ హాజరు విధానం నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో గతేడాది నవంబర్ 8 నుంచి అన్ని స్థాయిల ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేసింది. దీంతో పాటు బయోమెట్రిక్ యంత్రాల పక్కన శానిటైజర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ఉద్యోగులు హాజరుకు ముందు, తర్వాత తమ చేతులను విధిగా శుభ్రపరచుకునేలా చూసుకునే బాధ్యత విభాగాధిపతులదేనంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, తాజాగా దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో బయోమెట్రిక్ హాజరు విధానం నుంచి మరోసారి మినహాయింపు ఇచ్చింది.
No comments:
Post a Comment