APTF VIZAG: అవసరమైతే రాత్రి కర్ఫ్యూలు పెట్టండి. రాష్ట్రాలకు కేంద్రం లేఖ

అవసరమైతే రాత్రి కర్ఫ్యూలు పెట్టండి. రాష్ట్రాలకు కేంద్రం లేఖ

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కట్టడిలోనే ఉన్నప్పటికీ.. కొత్తగా పుట్టుకొచ్చిన ‘ఒమిక్రాన్‌’ వేరియంట్ చాప కింద నీరులా విస్తరిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వేరియంట్‌ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొవిడ్‌ నిబంధనలపై నిర్లక్ష్యంగా ఉండొద్దని, వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టిపెట్టాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ లేఖ రాశారు.

దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో గత రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోందని, వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్రం లేఖలో పేర్కొంది. కేరళ, మిజోరం, సిక్కిం రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. మిగతా 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10శాతంగా నమోదైనట్లు పేర్కొంది.

‘‘ఏ జిల్లాలోనైనా కేసులు, పాజిటివిటీ రేటు పెరిగినట్లు కన్పిస్తే.. వెంటనే అక్కడి స్థానిక యంత్రాంగం వ్యూహాత్మక చర్యలు ప్రారంభించాలి. ఆ ప్రాంతాల్లో పరీక్షలు, వ్యాక్సినేషన్‌ పెంచాలి. కంటైన్మెంట్‌ జోన్లుగా పరిగణించి.. అవసరమైతే రాత్రి కర్ఫ్యూ విధించాలి. జనసమూహాలు, పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో పాల్గొనేవారిపై పరిమితులు విధించాలి’’ అని రాజేశ్ భూషణ్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.*

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఒమిక్రాన్‌ కేసులు నానాటికీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. తాజాగా దేశ రాజధాని దిల్లీలో ఈ వేరియంట్‌ రెండో కేసు నమోదైంది. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 33కు చేరింది.

No comments:

Post a Comment