కొవిడ్ కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో కొవిడ్ వ్యాప్తి పరిస్థితిని సమీక్షించనున్నారు. ఓవైపు ఒమైక్రాన్ కేసుల పెరుగుదల కొనసాగుతుండగా.. మరోవైపు దేశంలో బూస్టర్ డోసు పంపిణీకి డిమాండ్లు వస్తున్నాయి. కొత్త వేరియంట్‌పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఇప్పటికే అప్రమత్తం చేసింది. దీంతో ప్రధాని సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ఒమైక్రాన్ వెలుగులోకి వచ్చాక నవంబరు నెలాఖరులో మోదీ సమీక్ష జరిపారు. కాగా, దేశంలో ఒమైక్రాన్ కేసులు 250కి పెరిగాయి. 15 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కరోనా వేరియంట్లను ఎదుర్కొనేందుకు అవసరమైన టీకా బూస్టర్ డోసులు ఎంత వరకు అవసరం..? ఎప్పుడు ఇవ్వాలనే విషయంలో శాస్త్రీయ నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్య విభాగం) డాక్టర్ వీకే పాల్ వెల్లడించారు. ఆక్సిజన్ సమర్థ నిర్వహణ, వృథా నివారణపై ఆరోగ్య కార్యకర్తలకు కేంద్రం శిక్షణ ఇస్తోంది. ‘‘నేషనల్ ఆక్సిజన్ స్టీవార్డ్‌షిప్ ప్రోగామ్’ కింద ప్రతి జిల్లాలో ఒక ఆరోగ్య కార్యకర్తను ‘‘ఆక్సిజన్ స్టీవార్డ్(సారథి)’’ను గుర్తించి శిక్షణ ఇస్తారు.
టీకా పొందితేనే పంజాబ్‌లో జీతం
ఒమైక్రాన్ ఆందోళనల మధ్య.. పండుగలు రానుండడంతో రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. కర్ణాటకలో కొత్త ఏడాది వేడుకలపై నిషేధం విధించగా, ఢిల్లీ క్రిస్మ్‌సతో పాటు కొత్త సంవత్సర వేడుకలనూ నిషేధించింది. సామూహిక కార్యక్రమాలకు అనుమతి తప్పనిసరని ముంబై కార్పొరేషన్ ఆదేశాలిచ్చింది. టీకా ఒక డోసు పొందినా, రెండు డోసులు తీసుకున్నా.. ధ్రువపత్రాన్ని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తేనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వాలని పంజాబ్ నిర్ణయించింది. టీకా పూర్తిగా పొందనివారిని జనవరి 1 నుంచి దుకాణ సముదాయాలు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లకు అనుమతించకూడదని హరియాణ సర్కారు ఉత్తర్వులిచ్చింది. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ భార్య, మాజీ ఎంపీ డింపుల్ యాదవ్‌కు కరోనా సోకింది. అఖిలేశ్ ఇంతవరకు టీకా పొందలేదు. ఎన్నికలున్నందున.. వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలను చెప్పాలని యూపీ సర్కారును ఎన్నికల సంఘం కోరింది.
ఇజ్రాయిల్‌లో 4వ డోసు.. యూకేలో లక్ష కేసులు
ఒమైక్రాన్‌తో మరో దేశంలో మరణం నమోదైంది. కొత్త వేరియంట్ బారినపడి రెండు వారాలుగా ఇజ్రాయిల్‌లోని బీర్షెబా నగరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 60 ఏళ్ల వ్యక్తి సోమవారం మృతిచెందాడు. ఆరోగ్య కార్యకర్తలు, 60 ఏళ్లు పైబడిన వారికి టీకా నాలుగో డోసు ఇచ్చేందుకు ఇజ్రాయిల్ సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాలో ఒమైక్రాన్ వ్యాప్తితో గత వారం రికార్డు స్థాయిలో 27 వేలకు పైగా కేసులు రాగా.. మంగళవారం అవి 15వేలకు పరిమితమయ్యాయి. గౌటెంగ్ ప్రావిన్సులోనూ కేసులు 16 వేల నుంచి 3,300కు తగ్గాయి. దీంతో తీవ్రత తగ్గుముఖం పట్టి ందా? అనే అంచనాలు వస్తున్నాయి. చైనాలోని గ్జియాన్ నగరంలో బుధవారం స్థానిక వ్యాప్తి ద్వారా 52 కరోనా కేసులు రావడంతో లాక్‌డౌన్‌కు ఆదేశాలిచ్చారు. కాగా, యూకేలో తొలిసారిగా కరోనా కేసులు లక్ష దాటాయి. బుధవారం 1.06 లక్షల పాజిటివ్‌లు వచ్చాయి.
మున్ముందు క్లిష్ట పరిస్థితులు: గేట్స్
మున్ముందు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోబోతున్నామని.. ఒమైక్రాన్ పట్ల అమెరికా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ విజ్ఞప్తి చేశారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో కేసులు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాను కూడా చాలా వరకు కార్యక్రమాలను రద్దు చేసుకున్నానని తెలిపారు.
కరోనా పరీక్షలకు సరికొత్త కిట్లు
వేగవంతంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి ‘టాటా ఎండీ చెక్ ఆర్టీ-పీసీఆర్ ఫాస్ట్ 3జీన్’, ‘టాటా ఎండీ చెక్ ఎక్స్‌ఎఫ్’ పేరిట కిట్లను అభివృద్ధి చేశామని టాటా మెడికల్, డయాగ్నోస్టిక్స్ సంస్థ బుధవారం ప్రకటించింది. విమానాశ్రయాల వంటి చోట్ల కచ్చితమైన ఫలితాలతో వేగవంతంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి ఆ కిట్లు బాగా ఉపయోగపడతాయని పేర్కొంది. ‘టాటా ఎండీ చెక్ ఎక్స్‌ఎఫ్’ కిట్‌తో 30 శాంపిళ్లను పరీక్షించవచ్చని, ఒక గంటలో ఫలితాలు తెలుస్తాయని వివరించింది. ‘టాటా ఎండీ చెక్ ఆర్టీ-పీసీఆర్ ఫాస్ట్ 3జీన్’ కిట్‌తో 90 శాంపిళ్లను పరీక్షించవచ్చని, 90 నిమిషాల్లో ఫలితం వస్తుందని పేర్కొంది.
No comments:
Post a Comment