APTF VIZAG: పిఆర్సీ నివేదికపై రిపోర్టు ఇవ్వడానికి నేడు రేపు అంటూ కాలక్షేపం.నివేదిక అప్పగింతకే ఇంత చేస్తే ఫిట్‌మెంట్‌ పరిస్థితి ఏమిటో?ఉద్యోగ సంఘాలు బయట ఒకలా ప్రభుత్వ పెద్దల దగ్గర మరోలా..అశుతోష్‌ నివేదికను మార్చారేమో?ఉద్యోగ వర్గాల్లో అనుమానం నేడు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీ

పిఆర్సీ నివేదికపై రిపోర్టు ఇవ్వడానికి నేడు రేపు అంటూ కాలక్షేపం.నివేదిక అప్పగింతకే ఇంత చేస్తే ఫిట్‌మెంట్‌ పరిస్థితి ఏమిటో?ఉద్యోగ సంఘాలు బయట ఒకలా ప్రభుత్వ పెద్దల దగ్గర మరోలా..అశుతోష్‌ నివేదికను మార్చారేమో?ఉద్యోగ వర్గాల్లో అనుమానం నేడు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీ

‘అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు రావాల్సినవన్నీ సవ్యంగా సమయానికి వచ్చేలా చేస్తా’’నని ప్రతిపక్షనేతగా  పాదయాత్ర సమయంలో వైఎస్‌ జగన్‌  ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తీరే మారిపోయింది. 11వ పీఆర్సీ కమిటీ చైర్మన్‌ అశుతోష్‌మిశ్రా తన నివేదికను జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికి ఇచ్చారు. ఆ తర్వాత ఏడాదిన్నర కాలం గడిపేశారు. ఇప్పటికీ పీఆర్సీ అమలుకు నోచుకోలేదు. పీఆర్సీ అమలు చేస్తారా... చేస్తే ఎప్పటినుంచి చేస్తారనేది పక్కనపెడితే.. కనీసం నివేదికను ఉద్యోగులకు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు రాకపోవడం గమనార్హం. పీఆర్సీ నివేదిక ఇవ్వడానికే ప్రభుత్వం ఇంత చేస్తే.. పీఆర్సీ ఫిట్‌మెంట్‌ ఇవ్వడానికి ఇంకెంత చేస్తుందోనంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు. వినాయకుడి పెళ్లి ఎప్పుడు అంటే... రోజూ రేపే అన్న చందంగా పీఆర్సీ నివేదికపై ప్రభుత్వం తీరు ఉన్నదని ఆగ్రహిస్తున్నారు. పీఆర్సీ అమలులో ఎప్పుడూ ఇంత జాప్యం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

దాపరికం ఎందుకో..

చివరిసారిగా 11వ వేతన సవరణ సంఘం 2018లో ఏర్పాటైంది. ఏడాది క్రితం తన నివేదికను అందించింది. అయినా.. ఇప్పటికీ ఆ నివేదిక సీఎం జగన్‌కు చేరలేదంటూ...బ్రీఫ్‌ చేయాలంటూ.. కావాలనే తాత్సరం చేస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. గత నెల 29వ తేదీన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. పీఆర్సీ నివేదిక రెండు రోజుల్లో ఉద్యోగులకు అందజేస్తామని ఈ సమావేశంలో సీఎస్‌ హామీ ఇచ్చారు. అయితే, సీఎం ఒడిసా పర్యటనకు వెళ్లార ని ఒకసారి.. సీఎంకు బ్రీఫ్‌ చేసిన తర్వాత ఇస్తామని మరోసారి చెబుతూ...ఈ రోజు వరకూ నివేదికను ప్రభుత్వం బయటపెట్టలేదు. 

8 లక్షల మంది ఎదురు చూపులు...

రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. పీఆర్సీ నివేదిక కోసం వీరంతా కళ్లుకాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఉద్యోగ జేఏసీలు.. ఉద్యోగ సంఘాలు ఇదుగో సీఎంను కలిశాం.. సీఎ్‌సను కలిశాం... ఇస్తామన్నారు.. చేస్తామన్నారు.. సీఎంకు బ్రీఫ్‌ చేసి.. చెబుతారంట.. అంటూ చెప్పే మాటలు వినీవినీ.. చెవులు దిబ్బిళ్లుపడినాయేకాని ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. పెరిగిన ధరలు... కరోనాతో కుటుంబాలు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ఉద్యోగులు పీఆర్సీనే నమ్ముకున్నారు. 

మేం సమాజంలో భాగం కాదా?

పీఆర్సీ జాప్యం, జీతాలకు సంబంఽధించిన అంశాలపై ప్రభుత్వ పెద్దలు చేసే వ్యాఖ్యలపై  ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తమను సమాజం నుంచి వేరుచేసి చూపే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహిస్తున్నారు. తమకు ఇవ్వాల్సిన పీఆర్సీ, డీఏలు, ఇతర అంశాలు సకాలంలో ఇవ్వకపోగా.. తమపైనే ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులైనందు వల్ల తమ కుటుంబానికి, పిల్లలకు ఎలాంటి పథకాలూ వర్తించవని.. సకాలంలో జీతాలు, డీఏలు, పీఆరీ కూడా ఇవ్వకపోతే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. కాగా, పీఆర్సీ నివేదికను ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుండడం ఉద్యోగుల్లో పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. నివేదికలో మార్పు చేర్పులు చేస్తున్నారా... నివేదిక బయట పెట్టడానికి అందుకే తాత్సరం చేస్తున్నారా... సమయం పొడిగించడం వెనుక ఉన్న మతలబు ఏంటి.... అంటూ ఉద్యోగులు, ఉద్యోగుల సంఘాల మధ్య చర్చ జరుగుతోంది. 

సమర శంఖం పూరించేనా..

సమస్యలపై పోరాటానికి సిద్ధం... కార్యాచరణ ప్రకటిస్తాం.. అంటూ ఉద్యోగ సంఘాలు చేస్తున్న ప్రకటనలపై ఉద్యోగుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీఆర్సీ ఇవ్వలేదు... ఏడు డీఏలు పెండింగ్‌లో పెట్టారు.. సీపీఎస్‌ రద్దు చేయలేదు... కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదని, అయినా ఇంకెప్పుడు ఉద్యమిస్తారు.. ఎప్పుడు పోరాటం చేస్తారు.. ఇంకా రెండున్నరేళ్లు గడిచిన తర్వాత పోరాటం చేస్తారా అనే విమర్శలు ఉద్యోగుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగుల ప్రతినిధులుగా కాక వీరు ప్రభుత్వ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని... అది చేస్తామంది.. ఇది చేస్తామంది.. అంటూ సర్కారు స్వరం వినిపిస్తున్నారని మండిపడుతున్నారు. 

నోడల్‌ అధికారి నియామకం

పీఆర్సీపై ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఒక నోడల్‌ అధికారిని నియమించింది. ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి ఆదినారాయణను ఈ బాధ్యతల్లో నియమిస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 

సచివాలయంలో ఉద్యోగ నేతల మధ్య వాగ్వాదం

సచివాలయంలో గురువారం  ఏపీఎన్‌జీవోఎ్‌స అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సచివాలయం మొదటి బ్లాక్‌లో ఉన్న జీఏడీ సర్వీసెస్‌ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ను కలిసేందుకు ఏపీ జేఏసీ, ఏపీజేఏసీ అమరావతి సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరు, బండి శ్రీనివాసరావులతోపాటు ఏపీ ఎన్జీవోనేత శివారెడ్డి సచివాలయానికి వచ్చారు. మొదటి బ్లాక్‌ వద్ద ఉన్న సెక్యూరిటీ అధికారులు బండి, బొప్పరాజును మాత్రమే అనుమతించడంతో, శివారెడ్డి రెండో బ్లాక్‌ వద్దే నిలిచిపోయారు. అనంతరం అక్కడకు వచ్చిన వెంకట్రామిరెడ్డిని భద్రతా సిబ్బంది మొదటి బ్లాక్‌లోకి అనుమతించడాన్ని శివారెడ్డి ఆక్షేపించారు. తమను ఎందుకు పంపలేదని నిలదీశారు. ఈ సమయంలో మొదటి బ్లాక్‌ వద్దకు వెళుతున్న వెంకట్రామిరెడ్డి ఆగారు. ‘మాతో మీకేం పని’ అంటూ శివారెడ్డిని తిట్టడంతో ఇద్దరిమధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం శివారెడ్డినీ భద్రతా సిబ్బంది మొదటిబ్లాక్‌లోకి అనుమతించారు.

No comments:

Post a Comment

Featured post

AP IPE MARCH-2024 Intermediate Hall Tickets Released