APTF VIZAG: అభయహస్తం పథకంతో ఇక మాకు సంబంధం లేదు.ఏపీ సర్కారుకు తెగేసి చెప్పిన ఎల్ ఐసీ

అభయహస్తం పథకంతో ఇక మాకు సంబంధం లేదు.ఏపీ సర్కారుకు తెగేసి చెప్పిన ఎల్ ఐసీ

ఏపీ ప్రభుత్వానికి జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) షాకిచ్చింది. ప్రభుత్వ పథకం అభయహస్తంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎల్ఐసీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎల్ఐసీ బహిరంగ ప్రకటన చేసింది. అభయహస్తం పథకం కింద తమ వద్ద ఉన్న రూ. 2 వేల కోట్ల నిధిని ఏపీ ప్రభుత్వం విత్ డ్రా చేసుకోవడంతో తమ ఒప్పందం రద్దయిందని తెలిపింది. 2021 నవంబర్ 3న ఒప్పందం రద్దయిందని చెప్పింది.

2009 నవంబర్ లో అభయహస్తం పథకం కోసం గ్రామీణ పేదరిక సంస్థతో ఎల్ఐసీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నవారు అభయహస్తం పథకంలో వారి వాటా చెల్లించడం ద్వారా 60 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్ పొందేందుకు అర్హులవుతారు. వైయస్ రాజశేఖరరెడ్డి రెండోసారి సీఎం అయిన తర్వాత 2009లో ఈ పథకాన్ని ప్రారంభించారు. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి రూ. 365 చెల్లిస్తే అంతే మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఇలా క్రమం తప్పకుండా చెల్లించిన వారికి 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెల రూ. 500 నుంచి రూ. 3 వేల వరకు పెన్షన్ అందించాలనేదే ఈ పథకం ఉద్దేశం.

అయితే ఎల్ఐసీ నుంచి నిధిని ఏపీ ప్రభుత్వం డ్రా చేసుకోవడంతో... ఒప్పందం రద్దయిందని ఎల్ఐసీ తెలిపింది. తమ వద్ద ఉన్న అన్ని నిధులను అభయహస్తం నోడల్ ఏజెన్సీ ఎస్ఈఆర్సీకి బదిలీ చేశామని చెప్పింది. అభయహస్తం పథకం కింద అన్ని కర్తవ్యాలు, బాధ్యతల నుంచి వైదొలిగామని తెలిపింది. ఇకపై ఆ పథకంతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. ఇకపై లబ్ధిదారుల క్లెయిములు, పెండింగ్ లో ఉన్న క్లెయిములు, భవిష్యత్తులోని క్లెయిములు అన్నింటినీ పరీక్షించే బాధ్యత గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థదేనని తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today