ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ, ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి ఆందోళన బాట పట్టాయి. డిసెంబరు 7 నుంచి జనవరి 6 వరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. తొలుత ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆర్టీసీ డిపోలు, తాలూకా, డివిజన్, జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసనలు, మధ్యాహ్న భోజన సమయంలో ఆందోళనలు.. అనంతరం ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తామని వెల్లడించాయి. ప్రభుత్వం స్పందించకపోతే విశాఖపట్నం, తిరుపతి, ఏలూరు, ఒంగోలుల్లో ప్రాంతాలవారీగా సదస్సులు నిర్వహిస్తామని తెలిపాయి. ఇది తొలి దశ ఆందోళన మాత్రమేనని.. ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే రెండో దశ మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించాయి. ఉద్యమ కార్యాచరణ నోటీసును డిసెంబరు 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇస్తామని వివరించాయి. రెండు నెలలుగా ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు సమస్యను తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయిందని ధ్వజమెత్తాయి. ప్రభుత్వమే ఉద్యమం దిశగా నెట్టిందని, ఇందుకు సర్కారే బాధ్యత వహించాలని స్పష్టం చేశాయి. ఇప్పటికైనా సీఎం జగన్ స్పందించి సమస్యల్న పరిష్కరించాలని డిమాండ్ చేశాయి.
ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆదివారం విజయవాడలో విలేకర్లతో మాట్లాడారు. అంతకుముందు రెండు ఐకాసలు వేర్వేరుగా.. అనంతరం ఉమ్మడిగా సమావేశమై కార్యాచరణ నిర్ణయించాయి.
సజ్జల, సీఎస్ మాటకే దిక్కు లేదు
పీఆర్‌సీపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన మాటకే దిక్కు లేకుండా పోయిందని, ఉన్నతాధికారులు చేతులెత్తేశారని బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ‘ప్రభుత్వం ఉద్యోగులపై వివక్ష చూపిస్తోంది. ఉద్యోగ సంఘాలకు విలువ, ప్రాధ్యానం లేని పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ ప్రయోజనాలు చెల్లించడం లేదు. ఒకటో తేదీన వేతనం ఇవ్వలేని పరిస్థితి. ఉద్యోగులకు సంబంధించి రూ.1,600 కోట్ల బకాయిల విడుదలపై ఇప్పటికీ కార్యాచరణ ప్రకటించలేదు. పీఆర్‌సీ నివేదిక ఎప్పుడు ప్రకటిస్తారంటే సమాధానం లేదు. కాగ్ నివేదిక బయటపెట్టినప్పుడు.. పీఆర్‌సీ నివేదిక బహిర్గతం చేయడానికి అభ్యంతరమేంటి?’ అని ప్రశ్నించారు.
కించపరిచేలా మాట్లాడుతున్నారు
ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో పాటు అవహేళన చేస్తూ మాలో కొందర్ని కించపరిచేలా మాట్లాడడం బాధ కలిగించింది. నిధుల్ని 90 శాతం ప్రజలకు పంచాలా.. లేక ఉద్యోగులకు ఇవ్వాలా అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడటం మమ్మల్ని కించపరచడమే. ప్రజలకు, మాకు ఎందుకు చిచ్చుపెడుతున్నారు? వేతనం ఆలస్యమయినా, అనేక ఇబ్బందులున్నా భరించాం. ఇంత జరుగుతున్నా సీఎం ఎందుకు పట్టించుకోవడం లేదు? సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అనుభవలేమితో మాట్లాడుతున్నారు. తొలుత నివేదిక లేకుండానే పీఆర్‌సీ ఇస్తుందని చెప్పారు. ఆ తర్వాత.. ప్రభుత్వానికి డిసెంబరు 10 వరకూ సమయం ఇస్తున్నట్లు చెప్పారు’ అని విమర్శించారు. ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, వైవీ రావు మాట్లాడుతూ.. ‘ఆర్థిక మంత్రి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. ఆయన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. పీఆర్‌సీ కోసం మూడున్నరేళ్లు ఓపిక పట్టినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దురదృష్టకరం. ఉద్యోగుల సమస్యలు నానాటికీ పెరుగుతుండటం ప్రభుత్వానికి ఆనందం కలిగిస్తుందా? సీపీఎస్ రద్దు హామీ అమలవలేదు. కారుణ్య నియామకాల్ని నవంబరు 30లోపు పూర్తి చేయాలని ఆదేశాలున్నా ఒక్క శాతం కూడా జరగలేదు. ముఖ్యమంత్రి సీరియస్‌గా పరిగణించడం లేదని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
వారంలోగా పీఆర్‌సీ కొలిక్కిప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి
పీఆర్‌సీ అంశాన్ని వారంలోపు పరిష్కరిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారని ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగ వ్యవహారాలు) చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. వేతన సవరణ అమలుపై సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించినట్లు ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు
No comments:
Post a Comment