APTF VIZAG: రెట్టింపు కానున్న డిప్యూటీ డిఇవోలు, ఎంఇవోలు. ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు. ఆర్థిక శాఖ వద్ద పెండింగ్

రెట్టింపు కానున్న డిప్యూటీ డిఇవోలు, ఎంఇవోలు. ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు. ఆర్థిక శాఖ వద్ద పెండింగ్

పాఠశాల విద్యలో భారీ మార్పుల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రతి మండలానికి ఇద్దరు మండల విద్యాశాఖ అధికారులు (ఎంఇవో), ప్రతి విద్యాశాఖ డివిజన్ పరిధిలో ఇద్దరు ఉప విద్యాశాఖ అధికారులు(డిప్యూటీ డిఇవో)లను ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఫైల్ ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉంది. ప్రభుత్వ, పంచాయితీ ఉపాధ్యాయుల మధ్య ఏళ్ల తరబడి ఉపాధ్యాయ సర్వీస్ రూల్స్ అంశం పెండింగ్లో ఉంది. ఈ అంశాన్ని పరిష్కరించే విధంగా కొత్త సర్వీస్ రూల్స్ తీసుకురావాలన్న ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎంఇవో, డిప్యూటీ డిఇవోల సంఖ్యను రెట్టింపు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. దీని ద్వారా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తే ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్య తీరిపోతుందనే ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఎంఇవో పోస్టుల్లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పదోన్నతులు పొందారు. నూతన ప్రతిపాదనలు అమల్లోకి వస్తే మరొకరికి ఎంఇఓ హోదా వస్తుంది. వారికే ప్రభుత్వ, మోడల్, కెజిబివి, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు అప్పగించాలని భావిస్తోంది. పంచాయితీ ఉపాధ్యాయులకు జిల్లా, ప్రాథమిక పరిషత్ పాఠశాలలను అప్పగించాలని ప్రతిపాదించింది. ఒక్కొ ఎంఇవో పరిధిలో కనీసం 50 పాఠశాలలు ఉండేలా విద్యాశాఖ ఆలోచిస్తోంది. ఒకవేళ మండల పరిధిలో 50 పాఠశాలలు లేకపోతే, మరో మండల పరిధిలో పాఠశాలలను కూడా కలిపి అప్పగించాలని భావిస్తోంది. కొన్ని పోస్టులను రద్దు చేసే ఆలోచన కూడా చేస్తోంది. డ్రాయింగ్, క్రాఫ్ట్ పోస్టులను రద్దు చేస్తే ఆర్థిక భారం తగ్గుతుందని విద్యాశాఖ భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 48 విద్యాశాఖ డివిజన్ల పరిధిలో 48 మంది డిప్యూటీ డిఇవోలు పనిచేస్తున్నారు. ఇందులో ఒకే ఒక్క డిప్యూటీ డిఇవో రెగ్యులర్ పద్ధతిలో ఉన్నారు. మిగిలిన 47 ఇన్చార్జులతో నెట్టుకొస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంఇవోలు 664 మంది ఉన్నారు. వీటిల్లో 98 పోస్టుల్లో మాత్రమే రెగ్యులర్ పద్ధతిలో ఉండగా 566 పోస్టులు ఇన్చార్జులతోనే కొనసాగుతున్నాయి.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4