ప్రీ ప్రైమరీ పాఠాలు సిద్ధం.పిల్లల కథలు, రైమ్స్‌తో పుస్తకాలు
రాష్ట్రవ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రారంభించనున్న పూర్వ ప్రాథమిక విద్యకు పాఠ్యాంశాలు సిద్ధమయ్యాయి. జాతీయ విద్యా విధానంలో భాగంగా అంగన్‌వాడీల్లో రెండేళ్లు పూర్వ ప్రాథమిక విద్యను బోధిస్తారు. మరో ఏడాది ప్రాథమిక పాఠశాలల్లో సంసిద్ధత తరగతులు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన పాఠ్యాంశాలను పాఠశాల విద్యాశాఖ రూపొందించి స్త్రీ, శిశు సంక్షేమశాఖకు అప్పగించింది. రాష్ట్రంలో 55వేల వరకు అంగన్‌వాడీలు ఉండగా మొదటి విడతగా పాఠశాలల ఆవరణల్లోని 3,900 కేంద్రాల్లో బోధిస్తారు. అనంతరం వీటిని 25 వేలకు పెంచనున్నారు. ఉపాధ్యాయులకు హ్యాండ్‌బుక్, పిల్లలకు మూడు రకాల పుస్తకాలను రూపొందించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేలా వీటిని తయారు చేశారు
అమలు ఇలా.
మూడేళ్లు నిండిన పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య-1 బోధిస్తారు. నాలుగేళ్లు నిండిన వారికి రెండో దశ బోధన ఉంటుంది. ఐదేళ్లు పూర్తయిన వారిని ప్రాథమిక పాఠశాలల్లో చేర్పిస్తారు. ఇక్కడ సంసిద్ధత తరగతులు ఏడాది పాటు ఉంటాయి. అనంతరం ఒకటో తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. జాతీయ విద్యావిధానం ప్రకారం మూడేళ్లు పూర్వ ప్రాథమిక విద్య కాగా.. వీటిని ఇలా మార్పు చేశారు. ప్రస్తుతం ఐదేళ్లు నిండిన వారికి ఒకటో తరగతిలో ప్రవేశం కల్పిస్తుండగా.. పూర్వ ప్రాథమిక విద్య కారణంగా మరో ఏడాది ఎక్కువ సమయం పట్టనుంది.
300 రోజులు కేంద్రాలు పని చేసేలా పాఠ్యాంశాలు రూపొందించారు.
ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 3.10 గంటల వరకు కొనసాగనున్నాయి. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు భోజనం, విశ్రాంతి సమయం ఇస్తారు.
అంగన్‌వాడీ కార్యకర్తలకు హ్యాండ్‌బుక్‌ను రూపొందించారు. విద్యార్థుల బోధనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పద్ధతులు, విధానాలు ఇందులో ఉంటాయి.
ఆంగ్ల అక్షరాల పరిచయం, తెలుగు అచ్చులు, హల్లులు, అంకెలు నేర్పిస్తారు.
పిల్లలకు కథలు, రైమ్స్, రాత అభ్యాసన పుస్తకాలను రూపొందించారు. ఒక అంశం ఇతివృత్తంగా 15 రోజులపాటు బోధిస్తారు. కుటుంబం, కుటుంబసభ్యుల మధ్య ఉండే బంధాలు, జంతువులు, పక్షులు ఇలా ఒక్కో అంశంపై వారం అభ్యాసన, మరొక వారం ప్రాక్టీస్ ఉంటుంది.
No comments:
Post a Comment