గత నెలలో విడుదల చేసిన అన్‌లాక్-5 మార్గదర్శకాలను కేంద్రం మరో నెల పాటు పొడిగించింది. అక్టోబర్ నెలకు ప్రకటించిన నిబంధనలే నవంబర్ నెలాఖరు వరకు వర్తిస్తాయని స్పష్టంచేసింది.
విద్యకు సంబంధించి ఇలా
★ పాఠశాలలు, విద్యాసంస్థలు, కోచింగ్ కేంద్రాల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకొనేందుకు రాష్ట్రాలకు వెసులుబాటు
★ క్షేత్రస్థాయి పరిస్థితులు అంచనా వేసిన తర్వాత విద్యాసంస్థల పునః ప్రారంభంపై నిర్ణయం తీసుకోవాలి.
★ ఆన్‌లైన్/దూరవిద్యా బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలి. వీలైనంతమేరకు దాన్ని ప్రోత్సహించాలి.
★ పాఠశాలలు తెరిచిన తర్వాతా ఆన్‌లైన్ తరగతులు కొనసాగి.. విద్యార్థులు వాటికి హాజరుకావడానికే ప్రాధాన్యం ఇస్తే వారికి అనుమతివ్వాలి.
★ తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితోనే విద్యార్థులను పాఠశాలలకు అనుమతించాలి.
★ హాజరును తప్పనిసరి చేయకూడదు. ఈ విషయంలో పూర్తిగా తల్లిదండ్రుల అనుమతి మేరకే నడచుకోవాలి.
★ కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల ప్రారంభ తేదీలపై హోంశాఖతో సంప్రదించి నిర్ణయించాలి.
★ రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఉన్నత విద్యాసంస్థల విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు.
కరోనా వైరస్ ఉద్ధృతి ఇంకా కొనసాగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. కంటైన్‌మెంట్ జోన్‌లలో అన్ని రకాల ఆంక్షలూ కొనసాగుతాయని స్పష్టంచేసింది. కంటైన్‌మెంట్ జోన్‌ల బయట దాదాపు అన్ని రకాల కార్యకలాపాలకు అవకాశం కల్పించిన కేంద్రం.. అంతర్జాతీయ ప్రయాణాలు, ఈత కొలనులు, వ్యాపార సమావేశాలు, వ్యాపార సంబంధిత ఎగ్జిబిషన్లు, 50శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమా హాళ్లు తెరుచుకొనేందుకు అవకాశం కల్పిస్తూ సెప్టెంబర్ 30న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
సామాజిక, క్రీడా, విద్యా, వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు, రాజకీయ సమావేశాలకు 200 మంది వరకు హజరయ్యేందుకు అవకాశం కల్పించింది. అయితే, ఇవే ఆదేశాలు నవంబర్ నెలాఖరు వరకు వర్తిస్తాయని పేర్కొంది. కరోనా వైరస్ విజృంభణతో దేశ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ తర్వాత క్రమంగా సడలింపులు ఇస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
ఆ మూడూ పాటించండి
కరోనాపై పోరాటమే లక్ష్యంగా ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన 'జన్ ఆందోళన్' కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేసింది. మాస్క్‌లు ధరించడం, చేతులు తరచూ శుభ్ర పరుచుకోవడం, కనీసం ఆరు అడుగుల భౌతిక దూరాన్ని పాటించడం వంటివి ప్రతిఒక్కరూ అమలుచేయాలని కోరింది. ఈ మూడు పాటించేందుకు అవసరమైన ప్రచారం కల్పించాలని, క్షేత్ర స్థాయి ప్రజలకు అర్ధమయ్యే రీతిలో ప్రచారం చేపట్టాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment