APTF VIZAG: ప్రభుత్వంపై హైకోర్టుకు వెళ్లిన ఉద్యోగులు

ప్రభుత్వంపై హైకోర్టుకు వెళ్లిన ఉద్యోగులు

ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందేలా చట్టం చేయాలని కోరుతూ గవర్నర్‌ను కలవడంపై రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్‌ నోటీసు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ‘జీతాలు, పింఛన్లు, ఇతర ప్రయోజనాల చెల్లింపులో తరచూ జాప్యం జరుగుతోంది. సకాలంలో చెల్లించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి 2021 జులై 8న వినతిపత్రం ఇచ్చాం. సమస్య పరిష్కారం కాలేదు. చివరికి దీనిపై విన్నవించడానికి ఈనెల 19న గవర్నర్‌ను కలిశాం. తర్వాత ఉద్యోగుల సమస్యలపై మీడియాతో మాట్లాడాం. వివిధ ఆరోపణలతో ప్రభుత్వం షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. అవన్నీ నిరాధార ఆరోపణలు. పత్రికా కథనాలను ఆధారంగా చేసుకుని నోటీసు ఇచ్చింది. సంఘం గుర్తింపును రద్దు చేయాలని ముందుగా నిర్ణయించుకొని ఈ చర్యలు చేపట్టింది. మేం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆరోపణలూ చేయలేదు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని షోకాజ్‌ అమలును నిలిపివేయండి’ అని పిటిషన్లో కోరారు. ఈ వ్యాజ్యం న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు వద్దకు సోమవారం విచారణకు రాగా, పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు వైవీ రవిప్రసాద్‌, పీవీజీ ఉమేశ్‌చంద్ర స్పందిస్తూ.. ఇది సర్వీసు సంబంధమైన విషయం కాదని తెలిపారు. సర్వీసు వ్యవహారానిది అనుకుని హైకోర్టు రిజిస్ట్రీ.. ఈ బెంచ్‌ వద్దకు విచారణకు వేసిందన్నారు. అత్యవసరం అయినందున తగిన బెంచ్‌ వద్ద మంగళవారం విచారణకు వచ్చేలా రిజిస్ట్రీని ఆదేశించాలని కోరారు. దీంతో న్యాయమూర్తి.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

No comments:

Post a Comment