పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతబద్ధీకరణను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ... రాష్ట్ర ప్రభుత్వ చర్యలు విద్యా హక్కు చట్టానికీ, జాతీయ విద్యావిధానానికీ విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆరు నుంచి 12ఏళ్ల వరకు విద్యను తప్పనిసరి చేస్తూ కేంద్రం విద్యా హక్కు చట్టం తీసుకొచ్చిందన్నారు. ఆర్‌టీఈ చట్టం మేరకు ప్రతీ 60 మంది విద్యార్థులకు కనీసం ఇద్దరు టీచర్లు ఉండాలన్నారు. కానీ ప్రతీ 30 మంది విద్యార్థులకు ఒక్క టీచర్ ఉంటే సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం సొంత భాష్యం చెబుతోందన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యా బోధన మాతృభాషలో ఉండాలని ఆర్‌టీఈ చట్టం చెబుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి వరకు ఒకే మాధ్యమంలో బోధన ఉంటుందని ప్రభుత్వం చెబుతోందని, ఏ మాధ్యమంలో బోధన చేస్తారనే విషయం పై ప్రభుత్వ ఉత్తర్వులలో స్పష్టత లేదని అన్నారు. గతంలో ప్రాథమిక విద్య కింద ఉన్న 3, 4, 5 తరగతులను ప్రభుత్వం ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేసిందన్నారు. దీంతో మూడో తరగతి నుంచే చిన్నారులు మూడు కిలోమీటర్లు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఈ కారణంగా పిల్లలు చదువులకు దూరం అవుతున్నారని వాదించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం విద్యా హక్కు చట్టం, జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ స్పందన కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయం విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా ఉందని పిటిషనర్ వాదనలు వినిపిస్తున్న నేపధ్యంలో ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలియజేస్తూ కౌంటర్ వేయాలని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ హరినాథ్‌ను ఆదేశించింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ టి.మల్లిఖార్జునరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతబద్ధీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 117, 128, 84, 85లను సవాల్ చేస్తూ ఏపీ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ కన్వీనర్ డి.రమేష్ చంద్ర సింహగిరి పట్నాయక్, డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో వేర్వేరుగా పిల్ దాఖలు చేశారు. అలాగే పాఠశాలల విలీనాన్ని సవాల్ చేస్తూ తూర్పుగోదావరి, కడప జిల్లాలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు బుధవారం ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి.
No comments:
Post a Comment