పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ), జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ల తరఫున న్యాయవాది ఇంద్రనీల్‌బాబు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం 1 నుంచి 5 తరగతి వరకు ఎస్‌జీటీ, 6 నుంచి 8 వరకు విద్యార్థులకు బీఈడీ అర్హత ఉన్న స్కూల్ అసిస్టెంట్లు బోధించాలన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఎస్‌జీటీలు చెప్పే తరగతులకు స్కూల్ అసిస్టెంట్లు, స్కూల్ అసిస్టెంట్లు చెప్పే తరగతులకు ఎస్‌జీటీలతో విద్యాబోధన చేయించే పరిస్థితి ఏర్పడిందన్నారు. పూర్తిస్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో విచారణను జనవరి 4కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దుర్గాప్రసాదరావు, జస్టిస్ మల్లికార్జునరావుతో కూడిన ధర్మాసనం గురువారం ఈమేరకు ఆదేశాలిచ్చింది.పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు జారీచేసిన జీవోలు 117, 128, 84, 85లను రద్దుచేయాలని కోరుతూ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేశారు. దీంతోపాటు ఇదే వ్యవహారంపై దాఖలైన మరో రెండు వ్యాజ్యాలను కలిపి హైకోర్టు విచారణ జరిపింది.
. బోధన సమయం తగ్గిపోతుంది
న్యాయవాది ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపిస్తూ.. ‘ప్రతి తరగతిని యూనిట్‌గా తీసుకొని సెక్షన్‌కు ఒక ఉపాధ్యాయుడు ఉండాలని విద్యాహక్కు చట్టం స్పష్టంచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం పాఠశాలను యూనిట్‌గా తీసుకుంటోంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని పాటించడం లేదు. దీంతో బోధన సమయం భారీగా తగ్గుతుంది. కేరళ హైకోర్టు ఇదే తరహా వివాదంలో తరగతికి కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండాలని స్పష్టంచేసింది. 1 నుంచి 8 తరగతి వరకు ఒకే మాధ్యమంలో బోధన ఉంటుందని జీవోల్లో పేర్కొన్నారు. కానీ ఏ మాధ్యమంలో చదువుకోవాలో నిర్ణయించుకునే హక్కు విద్యార్థులదే అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. విద్యాహక్కు చట్టం సెక్షన్ 29 మాతృభాషలోనే బోధన ఉండాలని స్పష్టంచేస్తోంది. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని జీవోలను రద్దుచేయండి’ అని కోరారు. ఏజీ ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ.. 1 నుంచి 8 తరగతుల పాఠ్యపుస్తకాలను ఆంగ్లం, తెలుగు భాషల్లో ముద్రించామన్నారు. తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు ఆంగ్లాన్ని ఐచ్ఛికంగా ఇచ్చామన్నారు. జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నామన్నారు.
No comments:
Post a Comment