మొన్నటికి మొన్న నోటీసులు, కేసులు, అరెస్టులతో అవమానించి.. ఇప్పుడు గురువులకు సత్కారం అంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందంటూ ప్రభుత్వంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. గురుపూజోత్సవం(సెప్టెంబరు 5) వేళ ఆ వేడుకలకు దూరంగా ఉండాలని పలు సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య, రెండు ఉపాధ్యాయ సంఘాలు, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం, నోబుల్ టీచర్ల సంఘం ఈ మేరకు పిలుపునిచ్చాయి. సీపీఎస్ రద్దు కోసం ఇటీవల నిర్వహించాలని భావించిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం సమయంలో ప్రభుత్వం టీచర్ల పట్ల అవమానకరంగా వ్యవహరించిందని సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. టీచర్లపై నాన్ బెయిలబుల్ కేసులు, బైండోవర్లు ప్రయోగించి ఇప్పుడు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారా అంటూ నిలదీశాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే గురుపూజోత్సవ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులెవరూ పాల్గొనవద్దని పిలుపునిచ్చాయి.
టీచర్లపై కర్కశంగా కేసులు: యూటీఎఫ్
సీపీఎస్ రద్దు ఆందోళనల సమయంలో సాధారణ ఉపాధ్యాయులపై ప్రభుత్వం కర్కశంగా కేసులు పెట్టిందని యూటీఎఫ్ అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు అన్నారు. టీచర్లపై కేసులు, బైండోవర్లను నిరసిస్తూ ఈనెల 5న ప్రభుత్వం నిర్వహించే గురుపూజోత్సవ కార్యక్రమాలను బహిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని తెలిపారు. అన్ని మండల, పట్టణ యూనిట్లలో దీనిని అమలుచేస్తామన్నారు.
టీచర్లను అవమానిస్తున్నారు:ఏపీటీఎఫ్257
ప్రభుత్వం టీచర్లను అదే పనిగా అవమానిస్తోందని ఏపీటీఎఫ్257 అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ మంజుల, కె.భానుమూర్తి విమర్శించారు. పోలీస్ స్టేషన్లలో రాత్రుళ్లు నిర్బంధిస్తున్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని, రూ.2 లక్షల పూచీకత్తుతో బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దుచేయాలని అడిగినవారిపై అక్రమ కేసులు పెడుతున్నందున ఈ ఏడాది గురుపూజోత్సవాన్ని బహిష్కరించాలని నిర్ణయించామన్నారు.
గురుపూజోత్సవానికి దూరం: టీఎన్‌యూఎస్
ఉపాధ్యాయులపై అకారణంగా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. కేసుల నమోదు, పాఠశాలల్లోకి వచ్చి నోటీసులు ఇవ్వడం, స్టేషన్లకు తీసుకెళ్లడం లాంటి చర్యలను నిరసిస్తూ గురుపూజోత్సవాన్ని బహరిష్కరిస్తున్నామన్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీనే అమలుచేయమంటే అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు.
ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత
మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఉపాధ్యాయ దినోత్సవంపై టీచర్లు వ్యతిరేకత చూపుతున్నారని ఏపీటీఎఫ్ 257 అనంతపురం జిల్లా నాయకులు పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని ఉపాధ్యాయభన్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎ్‌సను సీఎం జగన్ రద్దు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అందించే సత్కారాలను, సన్మానాలను తిరస్కరిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఏపీటీఎఫ్ 1938 అనంతపురం జిల్లా నాయకులు కూడా ఉపాధ్యాయ దినోత్సవాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు అనంతపురం డీఈవోకు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రవీంద్ర, ప్రధానకార్యదర్శి శ్రీనివాసురెడ్డి వినతిపత్రాన్ని అందించారు.
అటు కేసులు... ఇటు సత్కారాలా?: ఏపీటీఎఫ్ 1938
ఓవైపు కేసులు, జైళ్లు, యాప్‌లు అంటూ ఒత్తిడి చేస్తూ మరోవైపు శాలువాలతో సత్కారాలు చేస్తామంటే ఎలాగని ఏపీటీఎఫ్1938 అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. హృదయరాజు, ఎస్. చిరంజీవి ప్రశ్నించారు. తరగతి గదిలో బోధనా స్వేచ్ఛను కలిగిస్తే దానినే ఘన సన్మానంగా భావిస్తామన్నారు.
అవమానిస్తూ అవార్డులా?: నోబుల్ టీచర్ల సంఘం
సీఎం జగన్ ఇచ్చిన హామీ సీపీఎస్ రద్దును అమలు చేయాలని కోరిన టీచర్లపై కేసులు పెట్టి అవమానించి, ఇప్పుడు సత్కారాలు చేస్తున్నారా అని నోబుల్ టీచర్స్ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మూకల అప్పారావు, నడిపినేని వెంకట్రావు ప్రశ్నించారు. ఉపాధ్యాయులపై పెట్టిన కేసులను ఎత్తివేయకుండా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించే నైతిక హక్కు ప్రభుత్వానికి లేదని వారు స్పష్టం చేశారు. తక్షణం టీచర్లపై పెట్టిన కేసులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment