APTF VIZAG: బడుల విలీనంతో చదువుకు దూరం విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన - పాఠశాలకు తాళాలు

బడుల విలీనంతో చదువుకు దూరం విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన - పాఠశాలకు తాళాలు

చిన్నపిల్లలను దూరప్రాంతానికి పంపలేం

ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం

ప్రజాశక్తి-యంత్రాంగం : గ్రామంలోని పాఠశాలను ఎత్తివేస్తే తమ పిల్లలు ఎక్కడ చదువుకోవాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, ఆందోళనకు దిగారు. పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంలోని పలు జిల్లాల్లో మంగళవారం నిరసన తెలిపారు. పాఠశాలలకు తాళాలు వేశారు. ఉపాధ్యాయులను లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. పిల్లలకు ఇవ్వగలిగే ఆస్తి చదువేనంటూ ముఖ్యమంత్రి ఒకవైపు చెప్తూ, నూతన విద్యా విధానంలో భాగంగా పాఠశాలల సంఖ్యను మరోవైపు కుదిస్తుండడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్తున్న మాటలకు, ఆచరణకు పొంతన లేకుండా ఉందని ఆక్షేపించారు. తమ గ్రామంలోని పాఠశాలలను మూసివేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దగ్గరలోని పాఠశాలను మూసేసి, దూరంగా ఉన్న పాఠశాలకు వెళ్లాలని చెప్తుండడం ఎంతవరకూ సమంజమని ప్రశ్నించారు. ఈ ఆందోళనల్లో విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్లకూరు ప్రాథమికోన్నత పాఠశాలలో 6, 7, 8 తరగతులను కాళ్ల హైస్కూల్లో విలీనం చేయొద్దంటూ ఆ పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల 86 మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాళ్లకూరు ప్రాథమిక పాఠశాలకే సుమారు రెండు కిలోమీటర్లుపైబడి దూరం నుంచి వస్తున్నారని, కాళ్ల హైస్కూల్‌కు వెళ్లాలంటే ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ ఎస్‌సి కాలనీలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలను జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. అమరావతి రోడ్డు దాటి పాఠశాలకు వెళ్లాల్సి వస్తుందని, ఈ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల పంచాయతీ బండమీద జర్రావారిపల్లిలోని పాఠశాలను కీలపట్ల పాఠశాలలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. జర్రావారిపల్లిలోని పాఠశాలకు తాళం వేసి విద్యార్థులతో కలిసి అక్కడ బైటాయించారు. ఉపాధ్యాయులను లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ మూడు కిలోమీటర్ల దూరంలోని కీలపట్ల పాఠశాలకు వెళ్లాలంటే అడవి దారిలో ప్రయాణించాల్సి వస్తుందన్నారు. అడవి జంతుల దాడికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ పిల్లలను వేరే ఊరికి పంపే ప్రసక్తి లేదని నినాదాలు చేశారు. కార్వేటినగరం మండలం ఎన్‌ఆర్‌ కండ్రిగ, పాదిరి కుప్పం పాఠశాలలను జెడ్‌పి ఉన్నత పాఠశాల విలీనం వద్దని కోరుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆయా పాఠశాలల ఎదుట నిరసన తెలిపారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. 3, 4, 5 తగరతులకు ఇతర ప్రాంతాల ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకించారు. హిందూపురం పురపాలక సంఘం పరిధిలోని మేళాపురం ప్రాథమికోన్నత పాఠశాలను ముదిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ తల్లిదండ్రులు పాఠశాలకు తాళంవేసి నిరసన చేపట్టారు. కణేకల్‌, బెళగుప్ప, బ్రహ్మసముద్రం మండలాల్లోని నిరసనలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని మొగిలిపాడు పాఠశాలను విలీనం చేయొద్దని పాఠశాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆ పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. పాఠశాలలో సుమారు 260 మంది విద్యార్థులు చదువుతున్నారని, ఇంతమంది పిల్లలున్న పాఠశాలను ఎలా విలీనం చేస్తారని గ్రామస్తులు ప్రశ్నించారు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today