APTF VIZAG: కొత్త జిల్లాల ఏర్పాటుతో స్థానికత ఎలా? కొత్త జిల్లాలతో ఉపాధ్యాయుల్లో టెన్షన్

కొత్త జిల్లాల ఏర్పాటుతో స్థానికత ఎలా? కొత్త జిల్లాలతో ఉపాధ్యాయుల్లో టెన్షన్

కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. మే నెలలో ఉపాధ్యాయ బదిలీలు, రేషనలైజేషన్లను పాఠశాల విద్యాశాఖ చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఉపాధ్యాయులంతా విద్యార్థులు పరీక్షలపై దృష్టిసారించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో బదిలీలు, పదోన్నతులు ఎలా ఉంటాయనే అంశం పై వారిలో ఆందోళన నెలకొంది. పరిపాలన సౌలభ్యం కోసం ఒక్కో జిల్లాను రెండు, మూడు కొత్త జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సర్వీస్ మ్యాటర్స్పై ప్రభుత్వం నుంచి ఎటువంటి విధివిధానాలూ వెలువడలేదు. దీంతో తాము పాత జిల్లానా, కొత్త జిల్లానా? అనే అయోమయంలో ఉపాధ్యాయులు ఉన్నారు. స్థానికత ఎలా తీసుకుంటారోననే ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో మచిలీపట్నంకు చెందిన ఉపాధ్యాయుడు ప్రస్తుతం విజయవాడలో పనిచేస్తున్నారు. జిల్లాల విభజనతో ఆయన స్థానికత మచిలీపట్నంకు వస్తుంది. సర్వీస్ రిజిస్టర్ ప్రకారం బదిలీ చేస్తే ఆయన మచిలీపట్నంకు బదిలీ అవుతారు. అదేవిధంగా భార్యభర్తల బదిలీలు, వారి స్థానికతను ఎలా తీస్తారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. సర్వీస్ రిజిస్ట్రర్ ప్రకారం బదిలీ చేస్తే సమస్యలు వస్తాయని ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. ఆప్షన్ మేరకు బదిలీ చేపడితే ఇబ్బందులు ఉండవని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. బదిలీలు చేపట్టిన తరువాత పోస్టింగ్ ఉత్తర్వులు కొత్త జిల్లా డిఇఒ ఇస్తారా?, పాత జిల్లా డిఇఒ ఇస్తారా? అనే అంశం కూడా ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమూ 10 జిల్లాలను 33 జిల్లాలుగా చేసిన విషయం తెలిసిందే. ఈ జిల్లాల ఏర్పాటు చేసి ఐదేళ్లు గడిచినా ఇప్పటికీ ఉమ్మడి జిల్లాల ప్రతిపాదికనే ఉపాధ్యాయ బదిలీలను చేపట్టింది. ఉత్తర్వులను డిఇఒతో కాకుండా ప్రాంతీయ విద్యాశాఖ అధికారి (ఆర్జేడీ)తో ఇప్పించారు. జిల్లాలు విభజించిన తెలంగాణలో ఇప్పటి వరకు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించలేదు. జోనల్ విధానం కూడా మారుతుందా? ప్రస్తుతం ఉన్న నాలుగు జోన్లను కొనసాగిస్తారా? లేదా పెంచుతారా? తేలాల్సి ఉంది. జోన్లలో మార్పులు చేసినా, చేయకపోయినా క్యాడర్ డిక్లరేషన్ కోసం రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఆ తరువాత మాత్రమే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెబుతున్నారు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today