రాష్ట్రంలోని 47 డీఈడీ కాలేజీల గుర్తింపును రద్దు చేస్తూ గతేడాది అక్టోబరులో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలుపుదల చేసింది. ఆ ఉత్తర్వుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలోని పలు డీఈడీ కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు కల్పించారని, పాఠశాల విద్య కమిషనర్ దిల్లీలోని ఎన్‌సీటీఈకి లేఖ రాశారు. దాని ఆధారంగా రాష్ట్రంలోని పలు కాలేజీల గుర్తింపుని ఎన్‌సీటీఈని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌సీటీఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డీఈడీ కాలేజీలు యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ, న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపించారు. ‘నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీలకు ముందుగా నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలి. ఆతర్వాతే గుర్తింపు రద్దుపై నిర్ణయం తీసుకోవాలి. అందుకు విరుద్ధంగా వెబ్‌సైట్‌లో నోటీసులు ఉంచి సమాధానం ఇవ్వని కాలేజీల అనుమతిని రద్దు చేశారు. ఎన్‌సీటీఈ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించింది’ అని వివరించారు. ఆ వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఎన్‌సీటీఈ ఉత్తర్వుల ఆధారంగా తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.
No comments:
Post a Comment