ఏ చిత్తశుద్ధి (శాంటిటీ) ఉందని ఇంతకుముందు చర్చించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులనుద్దేశించి వ్యాఖ్యానించారు. పీఆర్సీపై ఏర్పాటైన మంత్రుల కమిటీ సచివాలయంలో సోమవారం సమావేశమైంది. అనంతరం సజ్జల విలేకరులతో మాట్లాడారు. మంత్రుల కమిటీకి ఏ చిత్తశుద్ధి ఉందని ఉద్యోగ సంఘాలు అడుగుతున్నాయన్న ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. ‘కమిటీకి ఏం అధికారం ఉందని అడుగుతున్నారంటే.. తీవ్రత (ఎస్ట్రీమ్)కు వెళ్లినట్లే. ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసిచ్చినా చర్చిస్తాం. జీతాల బిల్లులు తయారు చేయబోమనడం మెడపై కత్తి పెట్టడమే. దీని వల్ల నోటీసుకు, చర్చలకు అర్థం ఉండదు. ఈ విధంగా చేస్తే ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. ఉద్యోగులు ఇలాంటి ఆలోచన చేయడం కూడా సరైనది కాదు’ అని సజ్జల అన్నారు. ‘ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వస్తే మావైపు నుంచి ప్రభుత్వ నిర్ణయాన్ని చెప్పి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తాం. దీనిలో భాగంగా సోమవారం కమిటీ నిర్వహించే సమావేశానికి రావాలని సమాచారమిచ్చాం. ప్రభుత్వం నిర్ణయించిన కమిటీని గుర్తించబోమని ఉద్యోగ సంఘాలు చెప్పడం ప్రతిష్టంభన పెంచడమే అవుతుంది. పీఆర్సీపై అనుమానాలుంటే కమిటీని అడిగి తెలుసుకోవచ్చు. పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలి. మంగళవారం కూడా చర్చలకు రమ్మని పిలుస్తాం. ఉద్యోగుల అంశంపై కమిటీ మధ్యవర్తిత్వం వహిస్తుంది. చర్చలకు హాజరై.. సరిపోదు ఇంకొంచెం కావాలంటే ఉన్న పరిస్థితుల్లో ఎంత చేశామో చెబుతాం. ఉద్యోగులు ఎప్పుడూ ప్రభుత్వంలో భాగమే’ అని సజ్జల అన్నారు. ‘పీఆర్సీపై లక్ష రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ ప్రచారం చేస్తున్నారు. ఉన్న పరిస్థితుల్లో ఇంత చేయగలిగామని ప్రభుత్వం ఆ రోజూ చెప్పింది. ఇప్పుడూ చెబుతోంది..’ అంటూ వాలంటీర్లతో ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారన్న ప్రశ్నకు ప్రభుత్వ సలహాదారు సమాధానమిచ్చారు. ‘ఉద్యోగులకు నష్టం జరిగిందని అన్నప్పుడు.. ప్రభుత్వం తరఫున ఏం చేశామో చెప్పడం తప్పెలా? అవుతుంది. ఉద్యోగులకు వ్యతిరేకంగా విష ప్రచారం చేయడం లేదు కదా?’ అని అన్నారు.
అధికారిక కమిటీ కాదని ఎలా చెబుతారు?: మంత్రి బొత్స
కమిటీతో చర్చలకు రావాలని జీఏడీ కార్యదర్శి ఉద్యోగ సంఘాలకు ఫోన్ చేసి చెప్పాక అధికారిక కమిటీ కాదని ఎలా చెబుతారని మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్యోగ సంఘాల నేతలనుద్దేశించి అన్నారు. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నందున సీరియస్ నిర్ణయం తీసుకోవద్దని చెబుతున్నామని పేర్కొన్నారు. కొవిడ్, ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవాలని ఉద్యోగులకు సూచిస్తున్నామని ఆయన వివరించారు.
No comments:
Post a Comment