APTF VIZAG: పీఆర్సీ ఉత్తర్వులు రద్దు చేస్తేనే చర్చలు.సంప్రదింపులకు ఆహ్వానించిన ప్రభుత్వం.నిర్ద్వంద్వంగా తిరస్కరించిన ఉద్యోగ సంఘాలు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నేడు సమ్మె నోటీసు

పీఆర్సీ ఉత్తర్వులు రద్దు చేస్తేనే చర్చలు.సంప్రదింపులకు ఆహ్వానించిన ప్రభుత్వం.నిర్ద్వంద్వంగా తిరస్కరించిన ఉద్యోగ సంఘాలు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నేడు సమ్మె నోటీసు

జిల్లాలతో ఉద్యమ కార్యాచరణకు పర్యవేక్షణ సెల్‌ ఏర్పాటు

పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం

పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేస్తేనే ప్రభుత్వంతో చర్చల విషయం ఆలోచిస్తామని పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ తేల్చిచెప్పింది. ప్రభుత్వంతో చర్చలకు రావాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ చేసిన ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అశుతోష్‌ మిశ్ర నివేదికను ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది. అంతకుముందు.. ఉద్యోగ సంఘాల నాయకులను సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాల్సిందిగా మంత్రుల కమిటీ ఆహ్వానించింది. సంప్రదింపుల కోసం మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మలతో ఓ కమిటీని ఏర్పాటుచేశారు.

విజయవాడలోని రెవెన్యూ కార్యాలయంలో పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ ఆదివారం దాదాపు 5 గంటలకు పైగా సమావేశమై చర్చించింది. ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రభుత్వం, వైకాపా చేస్తున్న ప్రచారాన్ని ఖండించింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి విధానాన్ని చూడలేదంది. జనవరి నెలకు పాత జీతాలే ఇవ్వాలని, కొత్త జీతాలు ఇచ్చేందుకు ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి తేవొద్దని సూచించింది. జిల్లాలతో ఉద్యమ కార్యాచరణ సమన్వయం, సామాజిక మాధ్యమాల్లో వచ్చే విమర్శలపై సమాధానాలు ఇచ్చేందుకు 8 మంది సభ్యులతో పర్యవేక్షణ సెల్‌ను ఏర్పాటు చేసింది. స్టీరింగ్‌ కమిటీలో సభ్యులను 20కి పెంచారు. సమ్మెకు అన్ని సంఘాలూ మద్దతు ప్రకటించాయి.

ఇంత పెద్ద ఉద్యమం చరిత్రలోనే లేదు: బండి శ్రీనివాసరావు

ఇంత పెద్ద ఉద్యోగుల ఉద్యమం చరిత్రలో ఎప్పుడూ లేదని ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు తెలిపారు. ‘స్టీరింగ్‌ కమిటీలో అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించాం. సీఎస్‌కు సోమవారం మధ్యాహ్నం 3గంటలకు సమ్మె నోటీసు ఇస్తాం. ఈ ఉద్యమానికి కారణం ప్రభుత్వమే. పీఆర్సీ అంటే జీతాలు పెరగడమే చూశాం. కానీ, ఇప్పుడు జీతాల రికవరీ చూస్తున్నాం. పాత జీతాలే ఇవ్వాలని సీఎస్‌కు విన్నవించాం. ప్రభుత్వం మాత్రం కొత్త జీతాలు ఇవ్వాలని ట్రెజరీ అధికారులపై ఒత్తిడి తెస్తోంది. స్టీరింగ్‌ కమిటీ సభ్యుల సంఖ్యను 12 నుంచి 20 మందికి పెంచాం. జిల్లాలతో సమన్వయం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తాం’ అని తెలిపారు.

ఉద్యోగులను రెచ్చగొట్టడం మంచిది కాదు: బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఉద్యోగులను రెచ్చగొట్టడం మంచిది కాదని ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు హితవు పలికారు. ‘ఎప్పుడూ చరిత్రలో చూడని విధంగా సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా ప్రభుత్వం, వైకాపా ఉద్యోగులపై మాటల యుద్ధం చేయిస్తున్నాయి. ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నవి అబద్ధాలని, వారిపై మాటల యుద్ధం చేయాలని చెప్పడంపై ఆవేదన చెందుతున్నాం. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూల వాతావరణం కల్పించాలే గానీ, ఘర్షణ వాతావరణం సృష్టించకూడదు. ఉద్యమ సమయంలో ఆవేదన, ఆవేశంతో మాట్లాడిన వాటిపైనా కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఉద్యోగులకు వ్యతిరేకంగా కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ప్రభుత్వం, ఉద్యోగులు వేర్వేరు కాదు. చర్చలకు రమ్మంటారు.. వారు చెప్పినదానిపైనే ఉంటారు. మేము ఏ పార్టీనీ ఉద్యమంలోకి రానివ్వడం లేదు. గత రెండు, మూడు రోజులుగా జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే ఉద్యోగులు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారని ప్రభుత్వం భావిస్తున్నట్లు అనిపిస్తోంది. పీఆర్సీ నివేదికపై చర్చించకుండానే నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం పట్ల నిరసన తెలుపుతున్నాం. ఉద్యోగులందరూ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు. ఎవరూ రాజకీయ, వ్యక్తిగత దూషణలు చేయొద్దు. ప్రభుత్వంతో ఘర్షణ కోరుకోవడం లేదు. మెరుగైన పీఆర్సీ, సీఎం హామీలు అమలు చేయాలని కోరుకుంటున్నాం. పీఆర్సీపై ప్రభుత్వాన్ని ఎండగట్టాలి’ అని సూచించారు.

ఉత్తర్వులు రద్దుచేసే వరకూ చర్చలు ఉండవు: సూర్యనారాయణ

పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడం, అశుతోష్‌ మిశ్ర కమిటీ నివేదికను ఇస్తేనే ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని నిర్ణయించామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వెల్లడించారు. ‘ఉద్యమ కార్యాచరణపై సమావేశమయ్యాం. ప్రభుత్వంతో చర్చలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపైనా చర్చించాం. మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారన్నది మీడియాలో చూశాం. ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపేందుకు అధికారంగా కమిటీ ఏర్పాటుచేసినట్లు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ ఫోన్‌ చేసి, సోమవారం చర్చలకు రావాలని పిలిచారు. కమిటీ పరిధి ఏంటో తెలియడం లేదు. కొత్త పీఆర్సీని బలవంతంగా అమలుచేయడం నిలిపివేయాలి. జనవరికి పాత వేతనాలే ఇవ్వాలి. ఉద్యోగులు ఎవరికి వారు ఉద్యమ కార్యాచరణపై ఉండాలి. రాజకీయ వివాదాలకు తావు ఇవ్వకుండా ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించి చెప్పాలి’ అని సూచించారు.

పీఆర్సీ ఉత్తర్వులతో తీవ్ర నష్టం: వెంకట్రామిరెడ్డి

ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ ఉత్తర్వుల వల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. ‘పీఆర్సీపై ప్రభుత్వంతో చర్చలకు వెళ్లే సమయంలో అన్నీ సమన్వయం చేసుకోకపోవడంతోనే నష్టం జరిగిందని భావించాం. అందుకే కలిసి పోరాడాలని నిర్ణయించాం. ప్రభుత్వం పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి. అశుతోష్‌ మిశ్ర నివేదిక ఇవ్వాలి. ఆ నివేదికపై చర్చలు పునఃప్రారంభించాలి. మెరుగైన పీఆర్సీ ఇవ్వాలి. ఉద్యోగసంఘాల్లో వచ్చిన ఐక్యత చూసి, ఇతర సమస్యలను ప్రభుత్వం ముందు పెట్టాలని ప్రతిపాదనలు వస్తున్నాయి. ఉద్యోగులకు నమ్మకం కలగడంతో ప్రతిపాదనలు ఇస్తున్నారు. పీఆర్సీ, సీఎం ప్రకటించిన అంశాలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిపైనా చర్చిస్తాం. ఉద్యమ ఫలితాలు ఉద్యోగులకు దక్కేలా చూస్తాం. సచివాలయ ఉద్యోగుల సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహిస్తున్నాం. ఉద్యోగుల అభిప్రాయం తీసుకుంటాం’ అని రు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today