APTF VIZAG: విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించండి.ఆన్లైన్ క్లాసులు నిర్వహించండి. సీఎం జగన్కు ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ లేఖ

విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించండి.ఆన్లైన్ క్లాసులు నిర్వహించండి. సీఎం జగన్కు ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ లేఖ

కరోనా నేపథ్యంలో పిల్లల ఆరోగ్య పరిస్థితులనుదృష్టిలో ఉంచుకొని విద్యాసంస్థలకు నెలాఖరు వరకు సెలవు ప్రకటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బుధవారం ఒక లేఖ రాసింది. విద్యార్థుల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో క్లాసులు బోధించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. రాష్ట్రంలో కోవిడ్ వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ నెల 16న 4527 కేసులు నమోదు కాగా.. 17న 4108 కేసులు, 18న 6996 కేసులు, 19న అయితే ఏకంగా పది వేల 57 కేసులు వెలుగులోకి వచ్చాయని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో మొత్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 44, 935 ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిందని అసోసియేషన్ నేతలు నరహరి శిఖరం, సయ్యద్ జంషీద్, కె. జితేంద్ర, నాగ సైదయ్య, బాబుల్ రెడ్డి, ఏ. రమణారెడ్డి, జై ప్రకాష్ రెడ్డి, ప్రియాంక రెడ్డి, కె. శ్రీకాంత్, పి. శేఖర్ రెడ్డి, వి. శ్రీనివాస్, కె. రాంబాబు తదితరులు పేర్కొ న్నారు. మరోవైపు ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు ప్రకటించారని తెలిపారు. కరోనా కేసులు రోజువారీ పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని, కనుక తమ పిల్లల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 30వ తేదీ వరకు సెలవులు ప్రకటించాల్సిందిగా కోరుతున్నామన్నారు.

No comments:

Post a Comment