APTF VIZAG: ఏపీలో నైట్‌ కర్ఫ్యూ.. ఎప్పటి నుంచి అంటే?

ఏపీలో నైట్‌ కర్ఫ్యూ.. ఎప్పటి నుంచి అంటే?

కరోనా ప్రభావం దృష్ట్యా విధించిన రాత్రి కర్ఫ్యూపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి తర్వాత అంటే జనవరి 18వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు రోజూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొంది. పండగవేళ పెద్ద ఎత్తున ప్రజలు ఊళ్లకు వస్తుండటంతో కర్ఫ్యూ అమలు చేయటంలో ఇబ్బందులు తలెత్తుతాయని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు మొదట ఇచ్చిన ఉత్తర్వుల్లో సవరణ చేసింది.  నైట్‌ కర్ఫ్యూ నుంచి ఆస్పత్రులు, ఫార్మసీ దుకాణాలు, మీడియా సంస్థలు, టెలి కమ్యూనికేషన్లు, ఐటీ, విద్యుత్‌ సేవలు, పెట్రోల్‌ బంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులకు మినహాయింపు ఇచ్చినట్లు ఆదేశాల్లో పేర్కొంది.

బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించాలని.. వాణిజ్య దుకాణాలు, మాల్స్‌ తదితర వాటిల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే రూ.10వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశించింది. సినిమా హాళ్లలో 50 శాతం మందికే అనుమతించింది. ఆర్టీసీ సహా ప్రజా రవాణా వాహనాల్లో సిబ్బంది, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

No comments:

Post a Comment