APTF VIZAG: PRC:చర్చలు అసంపూర్ణం.ఉద్యమాన్ని విరమించాలని కోరిన ప్రభుత్వం.71 డిమాండ్లపై హామీ ఇస్తేనే.. నిర్ణయం తీసుకుంటామన్న ఐకాసలు

PRC:చర్చలు అసంపూర్ణం.ఉద్యమాన్ని విరమించాలని కోరిన ప్రభుత్వం.71 డిమాండ్లపై హామీ ఇస్తేనే.. నిర్ణయం తీసుకుంటామన్న ఐకాసలు

పీఆర్‌సీ, ఇతర 70 డిమాండ్లపై ఉద్యోగ సంఘాలతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం నిర్వహించిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ప్రధానమైన ఫిట్‌మెంట్‌ అంశంపై ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేదు. సచివాలయంలో సుమారు అయిదున్నర గంటల పాటు చర్చలు సాగాయి. మరోమారు చర్చలు జరిగే అవకాశం ఉంది. పీఆర్‌సీ నివేదికపై సీఎస్‌ కమిటీ చేసిన సిఫార్సులను పక్కన పెడితేనే.. చర్చలు ముందుకు సాగుతాయని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. 11వ పీఆర్‌సీ కమిషనర్‌ ఉద్యోగ సంఘాలతో చర్చించి, జిల్లాల్లో పర్యటించి రూపొందించిన నివేదికపైనే చర్చించాలని పట్టుబట్టగా.. అందుకు సజ్జల, మంత్రి అంగీకరించారు. ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి తరఫున 55% ఫిట్‌మెంట్‌కు ప్రతిపాదించగా.. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ 50%, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి 34% ఉండాలని కోరారు. సీపీఎస్‌ను రద్దుచేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండు చేశాయి. హెచ్‌ఆర్‌ఏ ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల విధానమే ఉండాలన్నాయి. సచివాలయ ఉద్యోగులతో పాటు సీఆర్‌డీఏ పరిధిలోని అందరికీ 30% హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని కోరగా..

అసలు సీఆర్‌డీఏ ఎక్కడుందని సజ్జల, మంత్రి ప్రశ్నించినట్లు తెలిసింది. పీఆర్‌సీకి సంబంధించి మొత్తం 20 అంశాలను ఉద్యోగసంఘాల నేతల ప్రభుత్వం ముందుంచారు. రెండు రోజుల పాటు చర్చలు జరిగినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేదని వారు పెదవి విరిచారు.

ఉద్యమ విరమణ, వాయిదాపై ప్రత్యేక చర్చలు

ఉద్యోగ సంఘాలతో చర్చలు ముగిసిన తర్వాత.. బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లుతో బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యేకంగా దాదాపు గంటకుపైగా సమావేశమయ్యారు.  ప్రధానమైన పీఆర్‌సీ, హెచ్‌ఆర్‌ఏ చర్చలు కొనసాగుతున్నందున ఉద్యమాన్ని విరమించాలని, మొండిగా పట్టుదలకు పోవద్దని కోరారు. మిగతావాటిని పరిష్కరిస్తామన్నారు. తమ డిమాండ్లపై హామీ ఇస్తేనే విరమిస్తామని, సీఎస్‌, ఆర్థికమంత్రి ఎప్పటికి ఏ సమస్యను పరిష్కరిస్తారో చెప్పాలని ఐకాస ప్రతినిధులు కోరారు. ఉద్యమాన్ని వాయిదా వేయడంపై చర్చలకు వస్తారా? అని ప్రతినిధులను కోరగా.. వస్తామని చెప్పారు. ఉద్యమం వాయిదా వేయడంపై మరోమారు ఐకాసలతో చర్చించే అవకాశం ఉంది.

సుహృద్భావ వాతావరణంలో చర్చలు: సజ్జల

ఉద్యోగుల డిమాండ్లలో కొన్ని వెెంటనే, మరికొన్ని 15 రోజుల్లో పూర్తయ్యేవి, నెల, రెండు నెలల్లో పరిష్కరించాల్సినవి ఉన్నాయి. వాటిలో పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ ప్రధానమైనవి. ఐఆర్‌ 27% సంరక్షిస్తూనే 14.29 ఫిట్‌మెంట్‌ ఇస్తామని సూచించాం. ఉద్యోగుల అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. త్వరలో సీఎంతోనూ ఉద్యోగ సంఘాలు సమావేశమవుతాయి. పదవీవిరమణ తర్వాత సీపీఎస్‌ ఉద్యోగులకు భద్రత ఉండాలని పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాం. ఉద్యోగ సంఘాలు ఐదారు ఐచ్ఛికాలను చెప్పాయి. సీపీఎస్‌పై నా వ్యాఖ్యలను ఎల్లోమీడియా వక్రీకరించింది.

ఫిట్‌మెంట్‌పై స్పష్టత లేదు

- బండి శ్రీనివాసరావు

పీఆర్‌సీ నివేదికలోని 45 పత్రాలు మాకు ఇచ్చి చర్చించారు. ఆ నివేదికను యథాతథంగా అమలు చేయాలని కోరాం. ఫిట్‌మెంట్‌పై స్పష్టత లేదు. నిర్ణయం తీసుకునే అధికారం సీఎం వద్ద ఉంది. 1.7.2018 నుంచి 55% ఫిట్‌మెంట్‌ కోరాం. ముఖ్యమంత్రితో మాట్లాడి చెబుతామన్నారు. చర్చలకు మళ్లీ ఆహ్వానిస్తామని చెప్పారు. చర్చలు సుహృద్భావ వాతావరణంలో సంతృప్తికరంగా జరిగినా, పూర్తికాలేదు. 71 డిమాండ్లతో మేం ఇచ్చిన నోటీసుపై సీఎస్‌, మంత్రి ఎప్పటికి పరిష్కరిస్తారో చెప్పాలి. అవేవీ లేకుండా ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదు.

సీఎం వద్దకైనా నల్లబ్యాడ్జీలతోనే

- బొప్పరాజు వెంకటేశ్వర్లు

పీఆర్‌సీ నివేదికను పాక్షికంగానే ఇచ్చారు. మొత్తం ఆరు సంపుటాలను ఇవ్వకపోవడం బాధాకరమని చెప్పాం. పీఆర్‌సీ సిఫారసులను ఆమోదిస్తూ జీవోలు ఇవ్వాలని.. అప్పుడే ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని చెప్పాం. రూ.1,600 కోట్ల బకాయిలు, పెండింగ్‌ డీఏలు, సీపీఎస్‌, హెల్త్‌కార్డుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు, స్పష్టమైన హామీ వచ్చేవరకు ఆందోళన విరమించబోమని చెప్పాం. 16న ధర్నాలు యథావిధిగా జరుగుతాయి. ఉద్యమాన్ని వాయిదా వేయాలని కోరినా, మా 71 డిమాండ్లపై చర్చలు జరిగేవరకు ఉద్యమాన్ని విరమించబోమని చెప్పాం. అప్పటి వరకు సీఎం వద్దకైనా చర్చలకు నల్లబ్యాడ్జీలతోనే హాజరవుతాం.

వైద్యబిల్లుల చెల్లింపు రూ.10లక్షలకు పెంచాలి

- సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి

ఉద్యోగులకు వైద్యబిల్లుల చెల్లింపు రూ.2లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచాలని కోరాం. ఫిట్‌మెంట్‌ 14.29%కు అంగీకరించబోమని, 34%కు తగ్గకుండా ఇవ్వాలని కోరాం. గ్రాట్యుటీని రూ.16లక్షల నుంచి రూ.18లక్షలకు పెంచాలి. పిల్లల సంరక్షణ సెలవులు ఏడాది ఇవ్వాలి. హైదరాబాద్‌ నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగులు, హెచ్‌వోడీ కార్యాలయ సిబ్బందికి హెచ్‌ఆర్‌ఏ 30% ఇవ్వాలి. పొరుగుసేవలు, ఒప్పంద ఉద్యోగులకు 30% ఫిట్‌మెంట్‌ సరిపోదు. వారికి మినిమమ్‌ టైం స్కేలు అమలు చేయాలి. వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు కొత్త పేస్కేల్స్‌ ఇవ్వాలి. సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాలకు సమావేశం నిర్వహించి, అన్నీ తేల్చాలని విన్నవించాం.

అధికారుల నివేదిక ప్రామాణికం కాదు

- ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ

సీఎస్‌ కమిటీ సమర్పించిన సిఫారసులు ప్రామాణికం కాదని, పీఆర్‌సీ కమిషన్‌ నివేదికపైనే చర్చ జరగాలని కోరాం. హైదరాబాద్‌ నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగులకు 30% హెచ్‌ఆర్‌ఏ కొనసాగించాలని పీఆర్‌సీ కమిషన్‌ సూచిస్తే అధికారుల కమిటీ తగ్గించాలంది. హైదరాబాద్‌ నుంచి వచ్చినందుకు ఐఏఎస్‌లు నెలకు రూ.40వేలు అద్దె తీసుకుంటున్నారు, ఇది ఎలా శాస్త్రీయమో చెప్పాలన్నాం. ఫిట్‌మెంట్‌ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా 20 అంశాలపై అన్ని సంఘాలూ ఒకే తాటిపై నిలబడ్డాయి. కనీస వేతనం రూ.26వేలు ఉండాలని కోరాం. శుక్ర లేదా సోమవారం సీఎంతో జరిగే సమావేశంలో పీఆర్‌సీకి శుభం కార్డు పడుతుందని భావిస్తున్నాm

No comments:

Post a Comment