APTF VIZAG: పీఆర్సీపై సమన్వయ కమిటీ?

పీఆర్సీపై సమన్వయ కమిటీ?

సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతల బైఠాయింపు

సీఎం జగన్ సీఎస్ సమీర్ శర్మ భేటీ నేడు తుది నిర్ణయం.

భవిష్యత్ కార్యాచరణకు ఉద్యోగ సంఘాలు సమాయత్తం

 ఉద్యోగుల వేతన సవరణ కమిటీ నివేదికకై ఉద్యోగ సంఘాలు ఆందోళనబాట పట్టాయి. గత రెండున్నరేళ్లుగా పీఆర్సీకి నోచుకోలేదని నివేదిక ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా ఉద్యోగ సంఘాలకు అందించక పోవటాన్ని నిరసిస్తూ బుధవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఉద్యోగ సంఘాల జేఏసీల సంయుక్త ఆధ్వర్యంలో సచివాలయంలో బైతాయింపు జరిపారు. నివేదిక అందించటంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. పీఆర్సీ నివేదిక ఇచ్చేంత వరకు కదిలేదిలేదని తక్షణమే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. సుమారు ఐదు గంటల పాటు సచివాలయం ఆవరణలో ఆందోళన నిర్వహించారు. గతనెల 29వ తేదీన జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగులకు పీఆర్సీని నెలాఖరులోగా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఒకటవ తేదీన జేఏసీల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మను కలిశారు. అయితే పీఆర్సీ నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించిన తరువాత ప్రతులను అందజేస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. రెండు రోజులు గడిచినా నివేదిక అందకపోవటంతో ఆందోళనకు దిగారు. ఏపీజేఏసీ, ఏపీజేఏసీ- అమరావతి ఉద్యోగ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగులు సచివాలయంలో ధర్నా నిర్వహించారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయ పిలుపు మేరకు సీఎస్ సమీర్ శర్మ పీఆర్సీ నివేదికపై ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. గతంలో ప్రకటించిన పీఆర్సీ, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఎంత ప్రకటించాలి? దీనివల్ల ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందనే అంశాలపై సీఎం జగన్ సీఎస్ సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు చర్చించినట్లు సమాచారం. రాత్రి పొద్దుపోయే వరకు చర్చించిన అనంతరం సీఎంఓ కార్యాలయం నుంచి సీఎస్ తిరిగి వెళ్లారు. అయితే సీఎస్ వచ్చి పీఆర్సీ నివేదికను అందిస్తారని భావించిన ఉద్యోగ నేతలు రాత్రి 9.30 గంటల వరకు బైఠాయింపు కొనసాగించారు. సీఎస్ సచివాలయానికి రావటంలేదనే విషయాన్ని తెలుసుకుని ఆందోళన తాత్కాలికంగా విరమించారు. ఈ సందర్భంగా ఏపీజేఎనీ, ఏపీజేఏసీ- అమరావతి చైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత రెండేళ్లుగా ఉద్యోగులు పీఆర్సీ ప్రకటించకపోవటంతో ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు విడతలుగా తాము సచివాలయం చుట్టూ తిరుగుతున్నా కనీస సమాచారం అందించటంలేదని దీంతో విసుగెత్తి ఆందోళనకు దిగినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్ పీఆర్సీపై ఆధారపడి ఉందని నివేదిక ఇవ్వటంలో ఉద్దేశపూర్వకంగానే జాప్యం జరుగుతోందని ఆరోపించారు. గత కొద్దిరోజులుగా నివేదిక కోసం నిరీక్షించి నిరసిస్తున్నా అధికారుల్లో చలనంం రావటంలేదని ఆక్షేపించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే జాప్యం జరుగుతోందని ఖండించారు. పీఆర్సీ నివేదికను అందించని పక్షంలో భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించుకుని ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. గురువారం ఇరు జేఏసీల ఆధ్వర్యంలో చర్చించుకుని తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు బొప్పరాజు తెలిపారు. 2018 జూలై లోనే 11వ పీఆర్సీని ప్రకటించాల్సి ఉండగా ఇప్పటి వరకు అసలు నివేదిక అందించకపోవటం దారుణమన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందనే భావనతోనే తాత్కాలికంగా ఆందోళన విరమిస్తున్నామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా పీఆర్సీపై ప్రభుత్వం అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేలా కనిపించటంలేదు. ఇప్పటికే 27 శాతం ఇంటీరియం రిలీఫ్ (మధ్యంతర భృతి) అమలు చేస్తున్నందున, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కరోనా నేపథ్యంలో ఉద్యోగులను సమన్వయ పరిచేందుకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయటం ద్వారా సమస్యను పరిష్కరించాలనే యోచనతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇదే అంశం సీఎం, సీఎస్ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. దీనిపై గురువారం ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today