APTF VIZAG: 28లోగా పీఆర్‌సీ ఇవ్వకపోతే సమ్మె నోటీసు.ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి ప్రకటన.జగన్‌ ఇచ్చిన హామీలూ అమలు కాలేదని ధ్వజం.పట్టించుకోకపోతే మూల్యం తప్పదని హెచ్చరిక

28లోగా పీఆర్‌సీ ఇవ్వకపోతే సమ్మె నోటీసు.ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి ప్రకటన.జగన్‌ ఇచ్చిన హామీలూ అమలు కాలేదని ధ్వజం.పట్టించుకోకపోతే మూల్యం తప్పదని హెచ్చరిక

వేతన సవరణపై ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించాయి. ఈ నెల 28లోగా పీఆర్‌సీ ప్రకటించకపోతే ఉద్యమిస్తామని ప్రకటించాయి. భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించి.. సమ్మె నోటీసు ఇస్తామని స్పష్టం చేశాయి. ఇప్పటివరకూ తాము పీఆర్‌సీ నివేదిక మాత్రమే అడిగామని.. నెలాఖరులోగా వేతన సవరణ కూడా ప్రకటించాలని వెల్లడించాయి. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించాయి. రెండున్నరేళ్లుగా ఉద్యోగుల సమస్యలేవీ పరిష్కారం కాలేదని ధ్వజమెత్తాయి. జగన్‌ స్వయంగా ఇచ్చిన హామీలు కూడా అమలవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎప్పటికప్పుడు డీఏలు ఇస్తామని ప్రకటించి... ఏడు విడతల బకాయిలకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని మండిపడ్డాయి. ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, వైవీ రావు విజయవాడలో శనివారం విలేకర్లతో మాట్లాడారు.

‘ఉద్యోగుల సమస్యలపై మాటలతో కాలయాపన చేస్తున్నారే తప్ప ఏ మాత్రం ప్రయోజనం లేదు. పీఆర్‌సీ నివేదిక ఇస్తామన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాటకే విలువ లేదు. ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు, అధికారులు సీఎంతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల్ని పరిష్కరించాలి’ అని డిమాండ్‌ చేశారు.

అధికారాలే లేని కమిటీ ఎందుకు?

‘దాదాపు నాలుగేళ్లవుతున్నా 11వ పీఆర్‌సీ ఇంకెప్పుడు ప్రకటిస్తారు? వేతన సవరణ నివేదికపై అధ్యయనానికి అధికారుల నేతృత్వంలో నియమించిన కమిటీ గత ఏడు నెలలుగా ఏం చేసింది? పీఆర్‌సీ సిఫారసులను మార్చే అధికారం కమిటీకి ఉందా? ఒక్క అధికారం లేని కమిటీ ఎందుకు? ఇదంతా కాలయాపన కోసమే. అధికారుల అధ్యయనంపై నమ్మకం లేదు’ అని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. ‘పీఆర్‌సీ నివేదిక ఇస్తామని చెప్పిన అధికారులు.. ఎందుకు దాచిపెడుతున్నారు? 2018 మేలో నియమించిన కమిటీ ఏడాదిలోపే నివేదిక ఇవ్వాల్సి ఉన్నా ఆలస్యం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేశాక.. వారికి వేతన సవరణ అంటూ మరో ఏడాది ఆలస్యం చేశారు. కమిషనర్‌ నివేదిక ఇవ్వడానికే దాదాపు రెండేళ్లు పట్టింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా 11వ పీఆర్‌సీ కమిషనర్‌ రాష్ట్రమంతా తిరిగి అనేక సిఫారసులు చేశారు. అందులో ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేకంగా ఏం సిఫారసు చేశారో చెప్పకుండా మేం అధికారులతో ఎలా చర్చలు జరపాలి? ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంవో అధికారుల హామీ ప్రకారం ప్రధాన సమస్యల్ని పరిష్కరించాలి’ అని డిమాండ్‌ చేశారు.

ఉద్యోగుల ఓట్లు మీకు అక్కర్లేదా?

‘రాష్ట్రంలో ఉద్యోగుల్లో నైరాశ్యం పెరిగింది. ఉద్యోగులకు డీఏలు బకాయిలు పెట్టడం సరికాదని.. మేం అధికారంలోకొస్తే మెరుగైన పీఆర్‌సీ ఇస్తామని గతంలో చెప్పారు. ఈ ప్రభుత్వం వస్తే హామీలన్నీ అమలు చేస్తారనుకున్నాం. స్నేహపూర్వక ప్రభుత్వం అంటున్నారు గానీ.. సమస్యలపై అధికారుల నుంచి సమాధానమే లేదు. ప్రభుత్వానికి ఉద్యోగుల ఓట్లు అక్కర్లేదా? జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ కింద ఉద్యోగులు దాచుకున్న డబ్బులివ్వడం లేదు. సీపీఎస్‌ను వారం రోజుల్లో రద్దు చేస్తామన్న హామీ అమలవలేదు. అధ్యయనం కోసం మంత్రులు, అధికారులతో కమిటీలు వేశారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ పూర్తికాలేదు. కారుణ్య నియామకాలపై సీఎం ఆదేశాలను తప్పుదారి పట్టించేలా అధికారులు మెమో ఇచ్చారు. ఉద్యోగుల ఆరోగ్య కార్డుల పథకం కోసం రూ.200 కోట్లు వాటాగా చెల్లిస్తున్నా నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదు. ఈ నిధులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ప్రభుత్వంలో విలీనమయ్యాక ఆర్టీసీ ఉద్యోగులు పింఛను లేకుండానే పదవీవిరమణ పొందుతున్నారు. ఉపాధ్యాయులకు బోధన తప్ప అన్ని పనులూ చెబుతున్నారు. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ అక్టోబరు 2న పూర్తవ్వాల్సి ఇప్పటికీ కాలేదు. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లేనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వేతనాలు ఆలస్యమైనా ప్రభుత్వానికి సహకరించాం. సమస్యలు పరిష్కరించకుండా మా సహనాన్ని పరీక్షిస్తున్నారు’ అని మండిపడ్డారు. సమావేశంలో ఏపీఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment