APTF VIZAG: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్: సీఎంల సమావేశంలో మోదీ సంచలన వ్యాఖ్యలు

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్: సీఎంల సమావేశంలో మోదీ సంచలన వ్యాఖ్యలు

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో సీఎంలకు ప్రధాని కీలక సూచనలు చేశారు. అందరూ మరోసారి అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో, అవసరమైన ప్రతి చోట మైక్రో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలను భయాందోళనలకు గురి చేయవద్దని చెప్పారు. జనాలు భయపడే వాతావరణాన్ని సృష్టించవద్దని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అవసరమైన ముందస్తు జాగ్రత్తలు, మరికొన్ని చర్యలు తీసుకుందామని చెప్పారు.

కరోనా సెకండ్ వేవ్ ను అనేక దేశాలు చూస్తున్నాయని... మన దేశం కూడా ఆ జాబితాలోకే వస్తుందని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా కేసులు పెరిగిపోయాయని... పలు రాష్ట్రాల సీఎంలు ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. టెస్టుల సంఖ్యను మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో టెస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోందని అసహనం వ్యక్తం చేశారు. సుపరిపాలన అందించడానికి మనందరికీ ఇదే సరైన సమయమని అన్నారు. ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుదామని... ఇదే సమయంలో అతి ఆత్మవిశ్వాసం పనికిరాదని చెప్పారు.

ఇప్పటి వరకు సురక్షితంగా ఉన్న జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని మోదీ తెలిపారు. దేశ వ్యాప్తంగా 70 జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉందని చెప్పారు. మనం అన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా మరోసారి పంజా విసురుతుందని హెచ్చరించారు. త్వరితగతిన అన్ని చర్యలను చేపట్టాలని సూచించారు.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4