APTF VIZAG: ఏపీ హైకోర్టు తరలింపుపై స్పందించిన కేంద్రం.పార్లమెంట్‌లో కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పందన

ఏపీ హైకోర్టు తరలింపుపై స్పందించిన కేంద్రం.పార్లమెంట్‌లో కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పందన

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూడు రాజధానుల అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు తరలించే అంశంపై కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పార్లమెంట్‌లో ఓ ప్రకటన చేశారు. హైకోర్టు తరలింపు అంశంపై ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధామనిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గతేడాది ఫిబ్రవరిలో హైకోర్టు ప్రధాన బెంచ్‌ను కర్నూలుకు తరలించాలని ప్రతిపాదించారని గుర్తుచేశారు. హైకోర్టుతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపుల తర్వాతే తరలింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

హైకోర్టు నిర్వహణ ఖర్చు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని, హైకోర్టు పరిపాలన బాధ్యతలు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉంటాయని పేర్కొన్నారు. హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందన్నారు.న్యాయస్థానం తరలింపు కోసం ఎలాంటి గడువూ లేదని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. తరలింపు వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని పేర్కొన్నారు.  హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలిస్తున్నారా అన్న జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4