APTF VIZAG: AP CM YS JAGAN REVIEW ON NADU NEDU AND JAGANANNA GORUMUDDA

AP CM YS JAGAN REVIEW ON NADU NEDU AND JAGANANNA GORUMUDDA

నాడు- నేడు, గోరుముద్దపై అధికారులతో సీఎం సమీక్ష పూర్తి వివరాలు 

 ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి ‘నాడు- నేడు’ కార్యక్రమం రెండో విడతకు సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు. ‘నాడు- నేడు’ కార్యక్రమంతోపాటు ‘గోరుముద్ద’పై క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. నాడు - నేడు మొదటి విడతలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్థవంతంగా రెండో విడత ప్రారంభించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దని అధికారులకు స్పష్టం చేశారు. రెండో విడత పనులను ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. డిసెంబర్‌ 31లోగా పనులు పూర్తిచేసేలా ప్రణాళిక వేసుకున్నట్లు వివరించారు. రెండో విడత కోసం సుమారు రూ.4,446 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మొదటి విడత కోసం సుమారు రూ.3,700 కోట్లు ఖర్చు చేస్తున్నదని, పాఠశాలను బాగుకు ఒక్క ఏడాదిలో ఇంత డబ్బు ఖర్చు చేయడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అధికారులు పేర్కొన్నారు.

పాఠశాల పునఃప్రారంభం, విద్యార్థుల హాజరుపై అధికారుల నుంచి సీఎం జగన్‌ వివరాలు కోరారు. పిల్లల హాజరుపై యాప్‌ను రూపొందించారా? లేదా? అని ప్రశ్నించగా ఫిబ్రవరి 15వ తేదీ నుంచి విద్యార్థుల హాజరుపై యాప్‌ ద్వారా వివరాలు సేకరిస్తామని అధికారులు బదులిచ్చారు.

విద్యార్థులు గైర్హాజరయితే వారి తల్లిదండ్రులకు సందేశం వెళ్లాలని, రెండో రోజు నేరుగా వలంటీర్‌ను పంపి వివరాలు తెలుసుకోవాలని సీఎం సూచించారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వి.చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

గోరుముద్దపై సమీక్ష అనంతరం ‘జగనన్న గోరుముద్ద’ కార్యక్రమంపై కూడా సీఎం జగన్‌ సమీక్షించారు.

గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకం పక్కాగా అమలు చేయాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణపై కూడా సీఎం సమీక్షించారు. టాయిలెట్ల నిర్వహణకు సులభ్‌ ఇంటర్నేషనల్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. నిర్వహణ కోసం దాదాపు 49 వేల మంది సిబ్బంది అవసరమని, టాయిలెట్ల నిర్వహణపై ఎస్‌ఓపీ టాయిలెట్ నిర్వహణ సిబ్బందికి సులభ్‌ ఇంటర్నేషనల్‌ శిక్షణ ఇస్తుందని సీఎం జగన్‌ అధికారులకు వివరించారు.

No comments:

Post a Comment