APTF VIZAG: Ap local body elections nominations and other procedure

Ap local body elections nominations and other procedure

స్థానికంలో పోటీ చేస్తున్నారా.?సర్పంచ్‌ స్థానానికి అర్హతలేమిటి..?నామినేషన్‌ ప్రక్రియ ఎలా ఉంటుంది..?అసత్య సమాచారం ఇస్తే ఏమౌతుంది..?పంచాయతీ ఎన్నికలపై అవగాహన తప్పనిసరి.

గ్రామ వికాసానికి సర్పంచు పదవి కీలకం. ఆ పదవికి పోటీ చేసేవారి పేరు అదే గ్రామ పంచాయతీ ఓటరు జాబితాలో నమోదై ఉండాలి. నామినేషన్‌ పరిశీలన నాటికి అభ్యర్థి వయసు 21 ఏళ్లు పూర్తయి ఉండాలి. 1995 అనంతరం ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న అభ్యర్థులు పోటీ చేయడానికి అనర్హులు. నామినేషన్లు వేయబోయే అభ్యర్థులు ఇలాంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలి. నామినేషన్‌ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నియమ నిబంధనలను సరిగా పాటించకపోతే నామినేషన్‌ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.

అర్హులు.. అనర్హులు..

గ్రామ ప్రజలతో సత్సంబంధాలు ఉండే వ్యక్తులే ఎక్కువగా ఎన్నికల బరిలో నిలుస్తుంటారు. రేషన్‌ డీలర్లు, ఆశా వర్కర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులా? కాదా? అనే అంశం చర్చల్లో ఉంటుంది. రేషన్‌ డీలర్లను ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులుగా గుర్తించారు. 2006లో సోమనాథ్‌ వి.విక్రం, కే. అరుణ్‌ కేసులో సుప్రీం కోర్టు తీర్పును పరిగణలోకి తీసుకుని ఉమ్మడి హైకోర్టు రేషన్‌ డీలర్లు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని తీర్పునిచ్చింది. అంగన్‌వాడీ వర్కర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వలంటీర్లకు మాత్రం ఆ మినహాయింపు లేదు.

నీటి వినియోగదారుల సంఘం సభ్యులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేదు. సహకార సంఘాల సభ్యులకు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉంటుంది. సహకార సంఘాల చట్టం 1954 కింద సహకార సంస్థలు రిజిస్టర్‌ అవుతాయి. ప్రత్యేక శాసనసభ చేసిన చట్టం ద్వారా నియమించలేదు కాబట్టి వారికి అవకాశం ఉంటుంది. 1987 హిందూ మత సంస్థల చట్టం, దేవదాయ శాఖ సెక్షన్‌ ప్రకారం ఏర్పడిన స్వచ్ఛంద, మత సంబంధ సంస్థల చైర్మన్లు, సభ్యులు కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.

అభ్యర్థికి ప్రతిపాదకుడిగా ఉన్న వ్యక్తి అదే వార్డు, ప్రాదేశిక నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చు.

అసత్య సమాచారం ఇస్తే..

అభ్యర్థి అసత్య సమాచారం ఇచ్చినా అధికారులు  నామినేషన్‌ను తిరస్కరించరు. అభ్యర్థిపై ఇతరులు ఫిర్యాదు చేసినపుడు, రిటర్నింగ్‌ అధికారి అభ్యర్థి ఇచ్చిన పత్రాల్లో సమాచారం తప్పని భావించినప్పుడు ఐపీసీ సెక్షన్‌ 177, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ 195 ప్రకారం అదే ప్రాంతానికి చెందిన న్యాయస్థానంలో ఫిర్యాదు చేయాలి. కానీ, నామినేషన్‌ను మాత్రం తిరస్కరించకూడదు.

నామినేషన్‌ వేసే వ్యక్తి ఏదేని ధ్రువీకరణ పత్రం అందించలేకపోయినా ఆర్వో నామినేషన్‌ను తీసుకుంటారు. అయితే చెక్‌ లిస్ట్‌లో సమర్పించని పత్రాల వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత డాక్యుమెంట్లు, నామినేషన్ల చివరి తేదీ నిర్దేత  సమయంలోపు ఆ పత్రాలు సమర్పించాలి. ఆ తర్వాత ఇచ్చినా స్వీకరించరు.

నామినేషన్‌ను తిరస్కరించే అంశాన్ని పరిశీలన సమయంలో నిర్ణయిస్తారు. అభ్యర్థికి నామినేషన్‌ పత్రాలపై  ప్రతిపాదకుడు సంతకం పెట్టకుంటే, ఆ మేరకు అఫిడవిట్‌ సమర్పించాలి. తదనంతరమే పరిశీలించి నామినేషన్‌ను తిరస్కరించే అధికారం రిటర్నింగ్‌ అధికారికి ఉంటుంది.

నేరం రుజువై ఉంటే..

కోర్టులో నేరం రుజువై, శిక్ష పడిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీకి అనర్హులు. శిక్ష అనుభవించకుండా బెయిల్‌పై బయట ఉన్నా అనర్హులే. అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరణ నోటీసుపై స్వయంగా సంతకం చేసి, నిర్దేశిత సమయంలోపు ఆర్వోకు అందించాలి. అభ్యర్థి ఇవ్వలేని  సమయంలో రాతపూర్వక అధికారం ఉన్న ప్రతిపాదకుడు ఎన్నికల ఏజెంట్‌ ద్వారా రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ సమర్పించవచ్చు. అభ్యర్థి ఒక్కసారి నామినేషన్‌ ఉపసంహరించుకున్న తర్వాత దాన్ని రద్దు చేసుకునే అవకాశం ఉండదు. నామినేషన్‌ను ఆర్వో తిరస్కరిస్తే, మరుసటి రోజు సబ్‌ కలెక్టర్‌, ఆర్డీవోకు అభ్యర్థి అప్పీల్‌ చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎక్కువ ప్రాదేశిక నియోజకవర్గాల్లో, వార్డుల్లో పోటీ చేయకూడదని పంచాయతీరాజ్‌ చట్టాల్లో ఎక్కడా పేర్కొన లేదు.

నామినేషన్‌ వేశాక..

పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఒక వ్యక్తి గరిష్ఠంగా నాలుగు నామినేషన్లు వేయవచ్చు. ఎక్కువ నామినేషన్లు వేసినా చెల్లుబాటు జాబితాలో అభ్యర్థి  పేరును మాత్రం ఒక్కసారే రాయాలి. అభ్యర్థి తన నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని అని భావిస్తే, చెల్లుబాటు జాబితే ప్రకటించిన తరువాతే ఉపసంహరించుకోవాలి. నామినేషన్‌ వేయడానికి అభ్యర్థి, ప్రతిపాదకుడు, మరో ముగ్గురిని ఆర్వో తన చాంబర్లోకి అనుమతిస్తారు. నామినేషన్‌ పత్రాల్లో అభ్యర్థి సంతకం చేయడం మర్చిపోతే దానిని తిరస్కరించవచ్చు. ఒక్కసారి నామినేషన్‌ వేశాక మార్పులు, చేర్పులకు అవకాశం ఉండదు.

No comments:

Post a Comment