రాష్ట్రవ్యాప్తంగా ఆర్జీయూకేటీ పరీక్ష నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా 4 రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో ఆరేళ్ల బీటెక్ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. నవంబర్ 28న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేశ్ వివరాలు వెల్లడించారు.
రాష్ట్రంలోని 4 రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో ఆరేళ్ల సమీకృత విద్యతో కూడిన బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి విజయవాడలో ఆర్జీయూకేటీ పరీక్ష తేదీలను ప్రకటించారు. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళంలలో ప్రవేశాలను ఇప్పటివరకు పదో తరగతి పరీక్షలో గ్రేడ్ ఆధారంగా నిర్వహించేవారు. ఈసారి కరోనా దృష్ట్యా పదో తరగతి పరీక్షల నిర్వహణ రద్దు చేయడం.. గ్రేడింగ్‌లు ఇవ్వలేకపోవటంతో ఉమ్మడి ప్రవేశ పరీక్ష అనివార్యమైందని మంత్రి సురేశ్ తెలిపారు.
పదో తరగతి సిలబస్ ఆధారంగా బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఆఫ్‌లైన్‌లోనే ఓఎమ్ఆర్ షీట్‌లో సమాధానాలు రాయాల్సి ఉంటుందన్నారు. పదో తరగతి గణిత శాస్త్రం నుంచి 50 మార్కులు.. భౌతిక, జీవశాస్త్రాల నుంచి చెరో 25 మార్కులకు ప్రశ్నలు ఉంటాయని మంత్రి చెప్పారు. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉండవని స్పష్టంచేశారు. నమూనా ప్రశ్నపత్రం, సిలబస్ వివరాలను www.rgukt.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు.ఆర్జీయూకేటీతోపాటు గుంటూరు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తిరుపతి వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్సాఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో రెండు, మూడేళ్ల డిప్లమో కోర్సుల్లో ప్రవేశానికి కూడా ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఈ తేదీల్లోనే నిర్వహిస్తున్నట్లు మంత్రి సురేశ్ వెల్లడించారు.
ఫీజు చెల్లించవలసిన తేదీలు : అక్టోబర్ 28-నవంబర్-10 అపరాధ రుసుముతో ఫీజు చెల్లింపునకు ఆఖరు తేదీ: నవంబర్ -15 హాల్ టికెట్ల డౌన్లోడ్ : నవంబర్ -22 నుంచి పరీక్ష నిర్వహణ : నవంబర్ -28 ఫలితాల వెల్లడి: డిసెంబర్ -5
100 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసిన ప్రతి మండలంలోనూ ఒక కేంద్రాన్ని ఎంపిక చేస్తామని.. ఒకవేళ వంద కంటే తక్కువ మంది ఉంటే దగ్గరగా ఉన్న సెంటర్‌కు వారిని కేటాయిస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంలో రాయదలచుకున్న అభ్యర్ధుల కోసం 10 కేంద్రాలను గుర్తించామని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ కేంద్రాల్లో తెలంగాణ ప్రాంత అభ్యర్ధులు పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరించారు.
No comments:
Post a Comment