కోవిడ్19 కారణంగా రాష్ట్రంలో పాఠశాలలు నవంబర్ 2 నుంచి తెరవనున్న నేపథ్యంలో తరగతుల నిర్వహణ, ప్రత్యామ్నాయ పాఠ్య ప్రణాళికపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయిస్తోంది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఆధ్వర్యంలో విద్యా రంగ నిపుణులతో ఈ కసరత్తు కొనసాగుతోంది. ఈ నెల 25 నాటికి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్‌పై ప్రతిపాదనలు అందించనున్నారు.
రానున్న రోజుల్లో పని దినాలను అనుసరించి విద్యార్థుల్లో అభ్యసన ఫలితాల సాధనకు వీలుగా పాఠ్యాంశాల నిర్ణయం, తరగతుల నిర్వహణ అంశాలపై దృష్టి సారించారు. పాఠశాల తరగతులను 1- 8 వరకు ఒక విభాగంగా, 9, 10 తరగతులను మరో విభాగంగా రూపొందిస్తున్నారు. 1- 8 తరగతుల వారికి తరగతుల నిర్వహణకు రెండు మూడు మార్గాలను ప్రతిపాదిస్తున్నా, 10వ తరగతి విద్యార్థులకు మాత్రం రెగ్యులర్ తరగతులు జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
విద్యార్థుల సంఖ్యను అనుసరించి తరగతులు : కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి విద్యార్థులను అనుమతించనున్నారు. ఎక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లలో ఉదయం కొన్ని తరగతులు, మధ్యాహ్నం కొన్ని తరగతులు నిర్వహించనున్నారు. లేదంటే కొన్ని రోజులు కొన్ని తరగతులు, మరికొన్ని రోజులు మరికొన్ని తరగతులు పెట్టనున్నారు. తొలుత తల్లిదండ్రుల కమిటీలతో సమావేశాలు పెట్టి పాఠశాలలకు పిల్లలను పంపడంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించనున్నారు. మధ్యాహ్న భోజనం సమయంలో భౌతిక దూరం పాటించేలా టీచర్లకు బాధ్యతలు అప్పగిస్తారు. స్కూలులో చెబితేనే నేర్చుకోగలుగుతారనే అంశాలు పాఠ్యాంశాలుగా ఉంటాయి. ఇంటిదగ్గర నేర్చుకొనే వాటికి సంబంధించి వీడియో, ఆడియోల రూపంలో విద్యార్థులకు అందిస్తారు. అదనంగా నేర్చుకొనే అంశాల గురించి వివరిస్తారు. ఈ మేరకు పాఠ్య ప్రణాళిక రూపొందిస్తున్నారు. 180 పనిదినాలు : ఏప్రిల్ 30 వరకు పాఠశాలలు కొనసాగించేలా పాఠ్య ప్రణాళిక రూపొందుతోంది. సంక్రాంతి సెలవులను కుదించడం ద్వారా 180 పని దినాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. అభ్యసన ఫలితాల సాధనకు వీలుగా అన్ని అంశాలు బోధించేలా ప్రణాళిక ఉంటుందని ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. ఈసారి పరీక్షలు రెండు ఫార్మేటివ్, ఒక సమ్మేటివ్ ఉండేలా చూస్తున్నారు. పాఠ్యప్రణాళిక ప్రకారమే పరీక్షలు : ప్రస్తుతం పరిస్థితిని అనుసరించి రూపొందిస్తున్న పాఠ్య ప్రణాళికనే టెన్త్ పరీక్షల నిర్వాహకులకు అందిస్తారు. దాని ఆధారంగానే ప్రశ్నపత్రాల రూపకల్పన, జవాబుల మూల్యాంకన జరిగేలా చూస్తారు. టెన్త్ పరీక్షలు ఏటా మార్చి 24 లేదా 26వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 10 వరకు జరుగుతుంటాయి. ఈసారి తరగతులు ఆలస్యమైనందున ఏప్రిల్ 15 నుంచి ప్రారంభించి, ఆ నెలాఖరులోగా పూర్తి చేస్తారు.
No comments:
Post a Comment