APTF VIZAG: పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయు విధానం,form 12,13

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయు విధానం,form 12,13

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయు విధానం:
ఎన్నికల సిబ్బంది  అందరూ తమ ఓటు హక్కును వినియోగించు కునేలా ఎన్నికల యంత్రాంగం నాలుగైదు రోజుల ముందు పోస్టల్ బ్యాలెట్ ను సిద్ధం చేస్తారు
ఆయా జిల్లాలకు చేరిన పోస్టల్‌ బ్యాలెట్లను అక్కడి అధికారులు నియోజకవర్గాల వారీగా సరఫరా చేస్తారు. జిల్లాల్లో పోలింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోలింగ్‌ రోజు లేదా ఒక రోజు ముందు సదరు కలెక్టర్‌ నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. ఆ ఉత్తర్వులతోపాటు పోస్టల్‌ బ్యాలెట్‌ను సిబ్బంది చేతికి ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందు కోసం ఆయా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. కాగా, 2014 ఎన్నికల్లో అవగాహన లేకపోవడమో.. బాధ్య తారాహిత్యమో తెలియదు కానీ వినియోగించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో సుమారు 25 శాతం తిరస్కరణకు గురయ్యాయి.
వినియోగించేది వీరే..
సాధారణ ఎన్నికల్లో సుమారు ఐదు రకాల వ్యక్తులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎన్నికల సిబ్బంది, సర్వీసు ఓటర్లు, ప్రత్యేక ఓటర్లు, నోటిఫైడ్‌ ఓటర్లు, నివారణ, నిర్బంధ ఓటర్లు ఈ విధానం ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే పరిపాలన సిబ్బంది, పోలీసు సిబ్బంది, డ్రైవర్లు, క్లీనర్లు, సెక్టార్‌ అధికారులు, బూత్‌ స్థాయి అధికారులు, సూక్ష్మ పరిశీలకులు, వీడియో గ్రాఫర్‌ లేదా ఫొటోగ్రాఫర్లు, వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహణ సిబ్బంది, తదితర వారు ఈ విధానం ద్వారా ఓటు వేయవచ్చు.
సర్వీసు ఓటర్లు
ప్రోక్సీ ఓటింగ్‌ను ఎంపిక చేసుకోకుండా మినహాయించుకున్న సాయుధ రక్షక భటులు, ఇతర రాష్ట్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారు సాయుధ బలగాలు సెక్షన్‌-60 ఆర్‌పీ యాక్టు 1950, సాయుధ బలగాల సభ్యులను సెక్షన్‌-46 ఆర్‌పీ యాక్టు 1950 ప్రకారం సర్వీసు ఓటర్లుగా పరిగణిస్తారు. వీరితోపాటు విదేశాల్లో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులూ పోస్టల్‌ విధానం ద్వారా ఓటేయొచ్చు.
ప్రత్యేక ఓటర్లు
రాష్ట్రపతి కార్యాలయంలో పని చేస్తున్న వారు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేయొచ్చు. ప్రధాన ఎన్నికల సంఘం ప్రకటించిన నోటిఫైడ్‌ ఓటర్లు కూడా ఈ విధానంలో ఓటు వినియోగించుకోవచ్చు. నివారణ(ప్రివెంటివ్‌), నిర్బంధం(డిటెన్షన్‌)లో ఉన్న ఓటర్లు ఈ విధానం ద్వారా హక్కును వినియోగించుకోవచ్చు. వీరితోపాటు సర్వీసు ఓటర్ల, ప్రత్యేక ఓటర్ల సతీమణులు కూడా ఈ విధానం ద్వారా తమ హక్కును వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘం ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి.
 ఎన్నికల సిబ్బందికి పోలింగ్‌కు ముందే పోస్టల్‌ బ్యాలెట్లు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బ్యాలెట్‌ పత్రాలను ఓట్ల లెక్కింపు(డిసెంబర్‌ 11)లోపే అందజేయాలి.
పోస్టల్‌ బ్యాలెట్‌కు వినియోగించే ఫారాలు
∙ఫారం-12 పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసే పత్రం
∙ఫారం-13ఏ ఓటరు ధ్రువీకరణ పత్రం
∙ఫారం-13బీ పోస్టల్‌ బ్యాలెట్‌ పెట్టాల్సిన లోపలి కవరు
∙ఫారం-13సీ వెలుపలి కవరు, రిటర్భింగ్‌ అధికారి తిరిగి పంపాల్సిన కవరు(ఇదే కవర్‌లో ఫారం-13బి పోస్టల్‌ బ్యాలెట్‌ లోపలి కవరు, ఫారం-13ఏ ఓటరు డిక్లరేషన్‌ పెట్టాలి.)
∙ఫారం 13-డి ఓటరుకు సూచనలు, సలహాలు ఉంటాయి.
అధికారులు నియామక ఉత్తర్వులతోపాటు ఫారం-12 దరఖాస్తు పత్రం ఇస్తే.. అందులో పూర్తి వివరాలు నింపి రిటర్నింగ్‌ అధికారి మొదటి శిక్షణ సులభతర కేంద్రం(ఫెసిలిటేషన్‌ సెంటర్‌)లో సమర్పించాలి. సదరు సిబ్బంది అదే రిటర్నింగ్‌ అధికారి పరిధిలో ఉంటే వెంటనే పోస్టల్‌ బ్యాలెట్‌ ఇస్తారు. ఆ ఆర్వో పరిధిలో లేకుంటే రిజిస్టర్‌ పోస్ట్‌ ద్వారా లేదా సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి పంపిస్తారు. ఆ పోస్టల్‌ బ్యాలెట్‌ను పూర్తి వివరాలతో నింపి సరైన పత్రాలు జత చేసి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలోని ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ఉన్న డ్రాప్‌ బాక్సులో వేయాలి. లేదా సంబంధిత ఆర్వోకు నిర్ధిష్ట సమయంలో చేరేటట్లు పోస్ట్‌ ద్వారా పంపించవచ్చు.
తక్కువ మంది ఉపయోగించడానికి కొన్ని కారణాలు
∙ఆర్వో దగ్గర నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ను తీసుకోవడంపై ఆసక్తి చూపించకపోవడం.
∙ఎన్నికల విధి నిర్వహణ ఉత్తర్వులతోపాటు ఫారం-12ను సరైన సమయంలో సమర్పించకపోవడం.
∙సరైన ఎలక్ట్రోరల్‌ రోల్‌లోని పార్ట్‌ నెంబర్, సీరియల్‌ నెంబర్‌ను నమోదు చేయకపోవడం.
∙ఎన్నికల సమయంలో పని చేసే సిబ్బందికి సరైన సమయంలో డ్యూటీ ఆర్డర్స్‌ అందకపోవడం.
∙ఫారం-12లో సరైనా చిరునామా ఇవ్వకపోవడం.
∙తీసుకున్న బ్యాలెట్‌ పేపర్‌ను నిర్ణీత సమయంలోగా ఆర్వోకు పంపకపోవడం.
ఓట్ల లెక్కింపులో తిరస్కరణకు
కారణాలు
∙డిక్లరేషన్‌ మీద సంతకం పెట్టకపోవడం.
∙డిక్లరేషన్‌లో బ్యాలెట్‌ పేపర్‌ సీరియల్‌ నంబర్‌ రాయకపోవడం.
∙గజిటెడ్‌ అధికారితో సర్టిఫైడ్‌ చేయించకపోవడం.
∙ఓటు వేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ను కవరులో పెట్టకపోవడం.
∙పోస్టల్‌ బ్యాలెట్‌ను, డిక్లరేషన్‌ను ఓకే కవరులో పెట్టడం
∙ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు మార్కు చేయడం.
∙ఏ అభ్యర్థికి మార్కు చేయకపోవడం.
∙ఏ అభ్యర్థికి చెందకుండా పైన లేదా కింద(అనుమానాస్పదంగా) మార్కు చేయడం
Click here to download form 12, 13

No comments:

Post a Comment