APTF VIZAG: Teachers Day on September 5th

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Teachers Day on September 5th

సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం.  సమాజాన్ని జాగృతంచేసి , విద్యార్ఢులలో నిభిడీకృతమైన శక్తులను వెలికితీసీ సంపూర్ణ వ్యక్తిత్వంకల భావిభారత పౌరులను తీర్చిదిద్దుతు ,ఉన్నత మానవతా  విలువలు కలిగిన పౌరసమాజాన్ని తీర్చి దిద్దుతున్న గురుదేవుళ్లందరికీ  ముందుగానే గురుపూజోత్సవ   శుభాకాంక్షలు. కోవిడ్ 19 వల్ల ఈ సంవత్సరం సోషల్ మీడియా ద్వారానే శుభాకాంక్షలు చెప్పుకోవలసిన పరిస్ధితి ఉంది.

సమాజంలో ఉన్నతంగా తీర్చి దిద్దబడిన ఒక వ్యక్తి నా ఈ స్థాయికి మా గురువుగారు కారణం అని చెప్పగలిగేలా చేసిన గురువు సమాజానికి దేవుడుతో సమానం. ఈ గౌరవంముందు  ఏ అవార్డయినా చిన్నదే అవుతుంది. అటువంటి అత్యుత్తమమైన సమాజ అభిమానం ప్రతీ ఉపాధ్యాయుడు పొందాలని ఆకాంక్షిస్తూ నా ఉపాధ్యాయ సోదర సోదరీమణు లెల్లరకూ  ఉపాధ్యాయ  దినోత్సవ శుభాకాంక్షలు. కె.సన్యాశి నాయుడు

మనదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం అయిన సెప్టెంబరు 5 తేదీన  ఉపాధ్యాయుల దినోత్సవం (Teachers' Day)   జరుపు కుంటాము.

పాఠశాల లేని పల్లెటూరైనా ఉండవచ్చేమోగానీ, ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదు.
విద్యార్ధి ...సంఘానికి దేహం వంటివాడైతే ఉపాధ్యాయుడు ఆత్మ.
అదృష్టవశాత్తూ సంప్రదాయాలకు పెద్ద పీట వేసే మన దేశంలో ఉపాధ్యాయుడికి ఉన్నత స్థానమే ఉంది. అందుకే ప్రతి ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా "టీచర్స్ డే" గా  జరుపుకుంటున్నాము.
 సెప్టెంబర్ 5నే ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణం ఆ రోజు భారత ద్వితీయ రాష్ట్రపతిగా అద్వితీయంగా తన పదవీ బాధ్యతలను నిర్వహించిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం కావడమే.  1962 నుండి 1967 వరకు దేశాధ్యక్షుడిగా పని చేసిన రాధాకృష్ణన్ ప్రారంభంలో ఉపాధ్యాయుడు. స్వయంగా ఉపాధ్యాయుడైన ఆయన విద్య మీద అపార నమ్మకంగలవాడు. విద్యాధికులు మాత్రమే దేశ సౌభాగ్యానికి చుక్కానులని ఆయన విశ్వసించేవారు. వాస్తవానికి ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5న జరపవలసిందిగా కోరిందీ ఆయనే. తన పుట్టిన రోజునాడు తనని అభినందించడానికి వచ్చిన తన అభిమానులను ఆయన ఈ రోజు నన్ను అభినందించడంకంటే ఉపాధ్యాయులను అభినందిం చడం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందనడంతో ఆ రోజు నుంచి ఉపాధ్యాయ దినోత్సవాన్ని రాధాకృష్ణన్ పుట్టిన రోజునాడు నిర్వహించడం జరుగుతున్నది.

 ప్రపంచవ్యాప్తంగా గొప్పవారైన వారిలో అనేకమంది తమ గొప్పతనాన్ని తమ గురువులకు ఆపాదించడం మనం చూస్తూనే ఉన్నాం.

"మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ" అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు.

 "గురువు" అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. "గు" అంటే చీకటి. "రు" అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడి పోయింది. "గు" అంటే గుహ్యమైనది, తెలియనిది. "రు" అంటే దానిని రుచ్యము చేసేది. అంటే ఆ రహస్యమైన దానిని తెలియపరిచేది.

ప్రేమ, ఆప్యాతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యార్ధుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవం. సాక్షాత్తూ భగవంతుడే తనకు మారుగా ఉపాధ్యాయుణ్ణి పంపిస్తే విద్యార్ధులు మాత్రం ఆయన్ను విస్మరించి మార్కుల కోసం, పరీక్షా ఫలితాలకోసం గుళ్ళూ, గోపురాల చుట్టూ తిరగడం శోచనీయం.

 ప్రయత్నం మానవ లక్షణం. విద్యార్ధి చేసే ప్రతి ప్రయత్నానికీ గురువు ఆశీస్సులు ఉంటాయి, ఉత్సాహ ప్రోత్సాహాలుంటాయి. గురువు నుంచి వాటిని పొందడం ముందుగా విద్యార్ధి కర్తవ్యం. అది అతని బాధ్యత కూడా. బాధ్యతను విస్మరిస్తే భగవంతుడు కూడా ఏమీ చెయ్యలేడనే వాస్తవాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పడం వారి బాధ్యత. ఒక కుటుంబంలాంటి సమాజంలో ఎవరు ఏ బాధ్యతను నిర్వహిస్తున్నా  గురువు నిర్వహించే బాధ్యత సాటిలేనిది. దేనితోనూ పోల్చడానికి వీలులేనిది. ఎందుకంటే గురువు జీవితాన్ని మారుస్తాడు. ఒక తల్లి లేదా తండ్రి తమ తమ కుటుంబాలపై ప్రభావం చూపవచ్చు. కాని ఒక గురువు బాధ్యత ఆ సమాజం పైనే తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. గురువు జాతీయ నిర్మాణకర్త కాబట్టి కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటాడు.

ఇక్కడ గురు శిష్య సంబంధం కూడా చర్చించతగ్గది. ఎందుకంటే విద్యార్ధుల మనసును విశ్లేషించడంలో ఉపాధ్యాయుడు ఎంతో ముందుంటాడు. అందుకోసం అతడు ఆ విద్యార్ధితో ఎంతో చనువుగా మెలుగుతాడు. అతనితో స్నేహం చేస్తాడు. అతనిలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. ఇదంతా జరగాలంటే ఆ ఉపాధ్యాయుడికి ఎంతో సహనం అవసరం. అసహనం ఎదుటి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి శాంతానికి చిహ్నంగా ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ నిలిచివుంటాడు. అంతే కాదు ఉపాధ్యాయుడు విద్యార్ధుల భవిష్యత్తును సన్మార్గంలోకి తీసుకెళ్ళే డ్రైవర్‌గానూ, వారి మానసిక ఉన్నతికి పాటుపడే వైద్యుడుగానూ, వివిధ రకాల పరిస్థితులను విడమరచి చెప్పడంలో సైంటిస్టుగానూ, కలబోసి వివరిస్తూ ఆపైవచ్చే ఫలితాన్ని చూపేందుకు వంటవాడిగానూ, అతనికి బలమైన నిర్మాణాత్మక శక్తినిచ్చేందుకు కాంట్రాక్టర్‌గానూ ...ఇలా సంఘంలో ప్రతి వృత్తినీ తనలో ఇముడ్చుకొని, తానే అన్ని వృత్తులని నిర్వహించేవాడిగా విద్యార్ధికి సంపూర్ణ అవగాహన కలిగేట్లు చేస్తాడు.

విద్యార్ధి కూడా ఆ విద్యాలయంలో తన విద్య పూర్తి కాగానే ఆ ఉపాధ్యాయుడితో తన పని పూర్తై పోయిందనుకోకూడదు. విద్యాలయంనుంచి బైటికొచ్చాకే అతనికి ఉపాధ్యాయుడి సందేశం అవసరమవుతుంది. అప్పటివరకు కంటికి రెప్పలా చూసుకున్న ఉపాధ్యాయుడి స్థానంలో అతనికి ఆ ఉపాధ్యాయుడి సందేశం మాత్రమే తోడుగా ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయుడి దగ్గర్నుంచి అప్పటివరకు తాను నేర్చుకున్న నడవడి, క్రమశిక్షణ మాత్రమే అతను పై అంతస్తులకు ఎదిగేందుకు దోహదపడతాయి. ఇప్పుడే విద్యార్ధి అత్యంత జాగరూకతతో నడుచుకోవాలి. ఇది అతని భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి తన గురువును తలుచుకుంటూ అడుగులేస్తే ఆ అడుగులు మరి అభ్యుదయంవైపే చకాచకా సగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

మాజీ రాష్ట్రపతి కలాం కూడా గతంలో ఉపాధ్యాయుడే. పదవీ విరమణ అనంతరం ఆయన మరలా ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించి మరణంవరకూ ఉపాధ్యాయుడుగానే ఉండడం ఉపాధ్యాయ వృత్తి ఔన్నత్యాన్నీ, విశిష్టతను తెలియజేస్తుంది.

ఇటీవల రష్యా అధ్యక్షుడు కోవిడ్ వేక్సిన్ విడుదలచేస్తూ ముందుగా వేక్సిన్ ఉపాధ్యాయులకు వైద్యులకు మాత్రమే ఇవ్వబడుతుందని ఉపాధ్యాయుడు లేని సమాజాన్ని మనం ఊహించలేమని చెప్పడం - సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర గురించి తెలియచేస్తుంది.

ప్రపంచంలో "సార్" అని ప్రతిఒక్కరూ సంబోధించతగ్గ ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే. దేశాధ్యక్షుడు సైతం "సార్" అని సంబోధించవలసిన ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే.

సమాజ నిర్మాణంలో కీలకపాత్ర వహించే ఉపాధ్యాయుడి పేరు మీద ఒక ప్రత్యేక రోజుని ఏర్పాటు చేసి ఆ వృత్తిని గౌరవిస్తుండడం మన సంస్కృతిలో నేడు అంతర్భాగమై పోయింది. ఇది ఎంతైనా గర్వించతగ్గ విషయం. ఇది సర్వత్రా వాంచనీయం. ఈ రోజుని ప్రతి విద్యాలయంలోనూ ఎంతో ఘనంగా నిర్వహించాలి. ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడం ద్వారా వారి సేవలను గౌరవించాలి. వారి ఆదర్శాలను అనుసరించాలి.

 ఒకప్పుడు బ్రతకలేక బడి పంతులు అనిపించుకున్న వృత్తి నేడు నేడు బ్రతుకు కొరకు బడి పంతులు అని వేనోళ్ళ కీర్తించబడుతుందంటే అందుకు కారణం సంఘ నిర్మాణంలో ఉపాధ్యాయుడు నిర్వర్తించిన ,నిర్వహిస్తున్న పాత్ర అని సగర్వంగా చెప్పవచ్చు.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results